Shivsena Supreme Court :   మహారాష్ట్రలోని శివసేన పార్టీ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. విల్లు, బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే కు  ఈసీ  కేటాయించడాన్ని సవాలు చేస్తూ  ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  ఈ పిటిషన్  అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది.  మంగళవారం  బెంచ్ ముందు ప్రస్తావించాలని సూచించింది. ఈ నెల 17 ఎన్నికల సంఘం  షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం  ఎన్నికల గుర్తును కేటాయించాలని ఆదేశించింది. అయితే దీనిని ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా ఖండించింది. ఈసీ నిర్ణయాన్ని తప్పబట్టింది. శివసేన పార్టీ పేరు,గుర్తు ఏక్ నాథ్ షిండేకు కేటాయించడం వెనుక రూ.2000 కోట్ల డీల్ జరిగిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. త్వరలోనే దీనికి సంబంధించి చాలా విషయాలు బయటకొస్తాయని చెప్పారు.


కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఉ  విధాన్ భవన్ లోని శివసేన పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గం స్వాధీనం చేసుకుంది. షిండే వర్గానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు శాసనసభలోని శివసేన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు కార్యాలయం ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు నియంత్రణలో ఉండేది. అక్కడ ఏర్పాటు చేసిన ఉద్ధవ్ ఠాక్రే బోర్డులు, బ్యానర్లను తొలగించారు.  శివసేన మా పార్టీ, ఇక నుంచి ఇతర కార్యాలయాలను మా స్వాధీనంలోకి తెచ్చుకొనేలా న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తామని షిండే వర్గం ప్రకటించింది. 


థాక్రే మరణం తర్వాత ఆ కుటుంబ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తండ్రి వారసత్వంగా పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే అనంతరం బీజేపీతో కలసి నడిచారు. అప్పుడు కూడా ఆ కుటుంబం నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. కానీ గత ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే తనకు ముఖ్యమంత్రిని కావాలని కోరిక కలగడం, తన కుమారుడు ఆదిత్య థాక్రేను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించడం ద్వారా శివసేనను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగిన శివసేన కౌంటింగ్ అనంతరం మనసు మార్చుకుంది. తమకు బద్ధ విరుద్ధులైన, సిద్ధాంతాలకు దూరమైన సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాను ముఖ్యమంత్రిగా, కుమారుడు మంత్రిగా కొన్నాళ్లు అధికారం చెలాయించిన ఉద్ధవ్ ను ఏక్‌నాథ్ షిండే గట్టి దెబ్బ కొట్టారు. అత్యధిక శాతం ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి అయ్యారు. 


ఇప్పుడు చివరకు శివసేన పేరు దూరమయింది. ధనస్సు గుర్తు కూడా దూరమయింది. థాక్రే భావజాలానికి దూరమయిన ఉద్ధవ్ నుంచి గుర్తు, పార్టీ పేరు వెళ్లడం కూడా సరైనదేనని ఏక్‌నాథ్ షిండే అంటున్నారు. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే కొత్త గుర్తుతో ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం అంతసులువు కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అతి పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో కొత్త గుర్తుతో వెళ్లి ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా అదే సలహా ఇచ్చారు. అయితే పార్టీ గుర్తు, పేరు వదులుకుంటే చాలా సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో  ఉద్దవ్ థాక్రే న్యాయపోరాటానికి మొగ్గు చూపుతున్నారు.