BRS And Janasena Alliance :   భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని  ఒక్క సారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుప్పు మంది. దీనికి కారణం ఏదైనా కొంత కాలం నుంచి ఈ అంశంపై రాజకీయవర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించడంతో బయటకు వచ్చింది. దీనిపై జనసేన వర్గాలు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ వర్గాలు కూడా సైలెంట్‌గా ఉన్నాయి.  సోషల్ మీడియాలో మాత్రం జనసేన కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కారణం ఏమైనా  బీఆర్ఎస్, జనసేన మధ్య చర్చల విషయాన్ని కొట్టి పారేయలేమని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. 


జాతీయ పార్టీగా మారాక  కలసి వచ్చే వారి కోసం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు !


తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కలసి వచ్చే వారి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన అనుకుంటున్నారు. అయితే బలమైన, ప్రజాకర్షణ ఉన్న నాయకుడు కావాలి. అలాంటి  నాయకుల కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు చాలా వరకూ ఫెలయ్యాయి. అందుకే  ప్రధాన పార్టీల తరపున  మూడు సార్లు పోటీ చేసినా ఓడిపోయిన తోట చంద్రశేఖర్‌కుఏపీ బీఆర్ఎస్  బాధ్యతలిచ్చారు. అయితే కనీసం బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసేలా  ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నిద బహిరంగ రహస్యమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్‌కు ఓ  బలమైన సమాజికవర్గం అండ ఉంటుంది కాబట్టి.. ఆయనతో కలిసి పోటీ చేస్తే మెరుగైన పలితాలు వస్తాయన్న కేసీఆర్ అంచనాతోనే... జనసేన పార్టీని సంప్రదిస్తున్నట్లుగా భావిస్తున్నారు. 


జనసేన పార్టీతో బీఆర్ఎస్ నేతల సంప్రదింపులు ! 


అయితే  సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగా ఎన్నికల ఖర్చుగురించి కాదు కానీ..    బీఆర్ఎస్‌తో  కలిసి పోటీ చేసే  విషయంపై పవన్ కల్యాణ్‌ను కొంత మంది బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.   బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఏపీ రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎలా మారతాయి. బీఆర్ఎస్ , పవన్ కల్యాణ్ కలిస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయి అన్నవాటిపై లోతైన పరిశీలనతో... బీఆర్ఎస్ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది మొత్తం బీఆర్ఎస్ వైపు నుంచి ఏపక్షంగా జరుగుతోంది కానీ పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎలాంటి ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు. 


అధికారంగా ఎలాంటి ప్రకటనా చేయని బీఆర్ఎస్, జనసేన పార్టీలు


రాజకీయవర్గాల్లో ఇంత రచ్చ  జరుగుతున్నప్పటికీ  రెండు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయా.. అదంతా గాసిప్పేనా అన్న విషయంపై అటు జనసేన కానీ.. ఇటు బీఆర్ఎస్ వర్గాలు కానీ స్పందించడం లేదు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ఆ రెండు పార్టీల తీరు ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం  బీజేపీతో పొత్తులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇటీవలే తెలంగాణలో కలిసి వచ్చే  పార్టీతో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. వీటన్నింటి  పరిణామాల మధ్య .. రెండు పార్టీల మధ్య ఏదో  జరుగుతోందన్నఅభిప్రాయం మాత్రం బలపడుతోంది. దీనిపై ముందు ముందు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.