East Godavari Crime News : తూర్పుగోదావరి జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ప్రబుద్ధుడిని పోలీసులు(Police) అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను దిశ(Disha) డీఎస్పీ సుంకర మురళీ మోహన్ తెలిపారు. రామచంద్రపురం మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కపిలేశ్వరపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనుల నిమిత్తం హైదరాబాద్(Hyderabad) వెళ్తూ తన భార్య, ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాలుడిని అమ్మమ్మ గారి గ్రామానికి పంపించాడు. బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా వేరే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు పాపకు చిరుతిళ్లు కొనిపెడతానని మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్ పై యువకుని స్వగృహానికి తీసుకెళ్లాడు. పాపపై పైశాచికంగా వికృతచేష్టలు చేసి లైంగిక దాడి చేశాడు.
బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్
బాలిక కోసం తల్లి, అమ్మమ్మ, బంధువులు గ్రామంలో వెతికారు. కానీ బాలిక జాడ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత యువకుడు బాలికను మోటారు సైకిల్ పై తీసుకొనివచ్చి మార్గమధ్యలో వదిలేశాడు. బాలికను ఇంటికి తీసుకొచ్చిన తల్లి ఆ బాలికకు రక్తస్రావం అవ్వడాన్ని గుర్తించారు. స్థానికుల సహాయంతో బాలికను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కాకినాడ దిశ డీఎస్పీ మురళీమోహన్, రామచంద్రపురం సీఐ వి. శ్రీనివాస్, ద్రాక్షారామం ఎస్ఐ తులసీరామ్ బాధితుల ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేయాలని టీడీపీ ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించిన మానవ మృగంపై కిడ్నాప్(Kidnap) కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా(Ex-gretia) ఇప్పించాలన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధితులకు పరిహారం అందేలా చూస్తాం
"నిన్న ద్రాక్షారామం పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వగానే చర్యలు ప్రారంభించాం. తెలిసిన అబ్బాయి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బాధితుల ఇంటికి వస్తూ ఉండేవాడు. బాలికతో యువకుడు పైశాచికంగా ప్రవర్తించాడు. నిందితుడిని అదుపులోకి తీసున్నాం. వైద్యుల నుంచి రిపోర్టు వచ్చాక కేసు తర్వగా దర్యాప్తు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం. దిశ చట్టం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. నేరానికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయి. బాధితులకు పోక్సో యాక్ట్ ప్రకారం, ఐసీడీఎస్ ద్వారా పరిహారం అందేలా చూస్తాం. ఇప్పటికే ఈ ఘటన గురించి ఐసీడీఎస్ అధికారులు వివరాలు అందించాం" -దిశ డీఎస్పీ సుంకర మురళీ మోహన్