ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య జరిగింది. గతంలో తెలంగాణలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్, హైదరాబాద్‌లో హేమంత్ హత్యల తరహాలోనే ఏపీలోని అనంతపురంలోనూ ఈ పరువు హత్య జరిగింది. తమ ఇంటి ఆడపిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుందనే అక్కసును భరించలేక ఆమె భర్తను అమ్మాయి తరపు వారు కిరాతకంగా చంపేశారు. వేట కొడవళ్లు వాడి నరికి చంపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లిలో చోటు చేసుకుంది. ఒక డ్రైవర్‌ను ఆమె పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు దాన్ని పరువు తక్కువగా భావించారు. దాంతో ఘోరం జరిగింది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన గొల్ల నరేంద్ర అనే వ్యక్తి తన మొదటి భార్యతో విడిపోయాడు. తర్వాత పామిడి మండలం కొనేపల్లిలో ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలోనే వెంకటం పల్లికి చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోడంతో వారిని ఎదిరించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కోనేపల్లిలో నివాసం ఉంటుండగా.. వారికి ఒక కుమార్తె కూడా ఉంది.


ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. నరేంద్ర ఇసుక సరఫరా చేస్తుంటాడు. ఆయన నడిపే ట్రాక్టర్ రిపేరు కోసం నరేంద్ర.. దాదాపు రెండేళ్ల తర్వాత వెంకటంపల్లికి వెళ్లాడు. పని ముగించుకొని బైక్‌పై తిరిగి వెళ్తుండగా, ఇదే అదునుగా భావించి అమ్మాయి బంధువులు దాడి చేశారు. గ్రామంలో అతణ్ని దారుణంగా అమ్మాయి కుటుంబ సభ్యులు నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. హత్య చేసిన దుండగులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.


చనిపోయిన వ్యక్తి భార్య కుళ్లాయమ్మ మాట్లాడుతూ.. తాను అతణ్ని పెళ్లి చేసుకున్నందుకే తన కుటుంబ సభ్యులు ఈ హత్య చేశారని తెలిపారు. తన అన్నలే తన భర్తను చంపారని నరేంద్ర భార్య కుళ్లాయమ్మ తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని ఉరికి తగిన శిక్ష పడాలని కన్నీరుమున్నీరయ్యారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతోనే ఇలా చేశారని.. తమ కూతురికి మరికొద్ది రోజుల్లో నామకరణం చేయాలని తలపెట్టామని గుర్తు చేశారు. ఇంతలో చిన్నపాప తండ్రిని కోల్పోయిందని వాపోయారు. తనకు, తన కూతురు, తన అత్తకు కూడా ప్రాణహాని ఉందని కుళ్లాయమ్మ రోదిస్తూ చెప్పారు.