New Delhi News: ఆ ఐదుగురూ స్నేహితులు. సరదాగా ఓ పార్కులో కూర్చొని పేకాట ఆడారు. ఉత్తిగా ఆడితే మజా రాదని.. బెట్టింగ్ కాశారు. అయితే ఓడిపోయిన ఓ వ్యక్తి.. రూ.300 బెట్టింగ్ డబ్బులను కట్టలేకపోయాడు. అతని వద్ద డబ్బులు లేకపోవడం, తాను కట్టనని మారాం చేయడంతో తీవ్ర కోపోద్రిక్తులు అయిన మిగతా స్నేహితులు అతడితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే కత్తితో గుండెలో, ఛాతిలో పొడిచి దారుణంగా హత్య చేశారు.
ఢిల్లీకి చెందిన ప్రమోద్, రజనీష్, అమిత్ కుమార్, రోషన్ సింగ్, అభిషేక్ అలియాస్ గోలు(20) స్నేహితులు. అయితే వీరంతా కలిసి ఆదివారం సాయంత్రం రోజు సంగం కాలనీ సమీపంలోని ఓ పార్కులో పేకాట ఆడారు. అయితే ఉత్తిగా ఆడితే మజా రాదని రూ.300 బెట్ కాశారు. ఈ క్రమంలోనే ప్రమోద్ గెలిచాడు. మిగతా వారంతా ఓడిపోయారు. అయితే అభిషేక్ అలియాస్ గోలు వద్ద డబ్బులు లేవు. ఇదే విషయాన్ని అతడు తన స్నేహితులకు తెలిపాడు. తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు. దీంతో మిగతా నలుగురు వ్యక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అతడితో గొడవకు దిగారు. ఎలాగైనా సరే 300 రూపాయల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ అభిషేక్ ఇవ్వనని చెప్పడంతో... పట్టరాని కోపంతో ప్రమోద్ అతడిపై దాడికి దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో అభిషేక్ ఛాతి, పొట్టలో పొడిచాడు. కత్తి అలాగే ఇరుక్కుపోయింది. దాన్ని స్నేహితులంతా కలిసి చాలా గట్టిగా బయటకు లాగారు.
సీసీటీవీ ఫుటేజీ, ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుల అరెస్ట్
అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గొడవ గురించి వివరించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వస్తున్న విషయం గుర్తించిన నిందితులు పారిపోయారు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న అభిషేక్ ను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ఇన్ఫార్మర్ల సాయంతో నిందితులపై నిఘా పెట్టారు. ఈక్రమంలోనే తమకు అందిన సమాచారంతో సోమవారం రోజు నిందితులను పట్టుకున్నారు. రజనీష్, అమిత్, రోషన్‌లను నోయిడా వద్ద పట్టుకోగా, ప్రధాన నిందితుడు ప్రమోద్‌ను ఢిల్లీ - లక్నో హైవే వద్ద అరెస్టు చేశారు. అతను గోరఖ్‌పూర్‌కు పారిపోవడానికి బస్సు కోసం ఎదురు చూస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సంజయ్ సేన్ తెలిపారు.
ప్రమోద్ నుంచి కత్తి, రక్తపు మరకలతో ఉన్న బట్టలు, రూ.300 స్వాధీనం
ప్రమోద్, రజనీష్ స్కూల్ డ్రాపౌట్స్ కాగా, అమిత్ కాలేజీలో చదువుతున్నాడు. రోషన్ సింగ్ ఇంటర్ సెకండియర్ పూర్తి చేశాడు. నిందితుల్లో ఒకడైన ప్రమోద్ నుంచి కత్తి, రక్తపు మరకలతో కూడిన బట్టలు, రూ.300 లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు ప్రమోద్ ఆవేశంలోనే తన స్నేహితుడు అభిషేక్ ను హత్య చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నట్లు డీసీపీ సంజయ్ సేన్ వివరించారు.