Viral Video: 



ద్వారకాలో ఘటన..


ఢిల్లీలోని ద్వారకాలో మైనర్‌ని ఇంట్లో పనికి పెట్టుకుని హింసిస్తున్నారన్న కోపంతో ఓ మహిళా పైలట్‌ని, ఆమె భర్తని చితకబాదారు. పదేళ్ల బాలికని పని మనిషిగా పెట్టుకోవడమే కాకుండా ఆమెని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ కోపంతోనే ఒక్కసారిగా ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లోకి వెళ్లి దంపతుల్ని బయటకు లాగి మరీ కొట్టారు. ఈ ఇద్దరు నిందితులు ఓ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నారు. ముందుగా భర్తను  బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టారు. ఆ తరవాత అతడి భార్యపైనా దాడి చేశారు. కొంత మంది మహిళలు ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చారు. "క్షమించండి" అని ఎంతగా వేడుకున్నా ఆ మహిళలు ఆమెను వదల్లేదు. "నా భార్య చనిపోతుంది వదిలేయండి" అని భర్త కూడా వేడుకున్నాడు. అయినా మూకదాడి ఆగలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం...రెండు నెలల క్రితం ఈ దంపతులు పదేళ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. బాలిక చేతులపై గాయాల్ని గమనించారు బంధువులు. ఏమైందని అడగ్గా..దొంగతనం చేశానన్న సాకుతో కొట్టారని ఏడుస్తూ చెప్పింది ఆ బాలిక. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ దంపతుల ఇంటికి వెళ్లారు. ఒక్కసారిగా మూకదాడి చేశారు. ఆ తరవాత పోలీసులు వచ్చి ఈ దాడిని నిలువరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతుల్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం. కానీ...చాలా మంది ఈ నిబంధనను పట్టించుకోకుండా పిల్లలతో చాకిరీ చేయిస్తున్నారు. 






బాలిక చేతులపై కాలిన గాయాలను గమనించిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. బాధితురాలికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. 


"బాలికకు వైద్య పరీక్షలు చేశాం. ఆమె చేతిపై కాలిన గాయాలున్నాయి. కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశాం. బాల కార్మికుల చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్‌ల కింద కఠిన చర్యలు తీసుకుంటాం"


- పోలీస్ ఉన్నతాధికారి