పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్స్ లో సముద్రఖని డైరెక్షన్లో రాబోతున్న 'బ్రో' సినిమా నుంచి ఇటీవలే సెకండ్ సాంగ్ ‘‘జాణవులే..’’ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించారు. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే పాటలు హైలెట్ కావాలి. రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయ్యి జనాల నోళ్లలో నానాలి. కానీ ‘బ్రో’ విషయంలో మాత్రం అది రివర్స్ అవుతోంది. 'బ్రో'కు ఇప్పటికే మంచి బజ్ లేదని, పాటలతో అయినా ట్రాక్ లో పడుతుందని అనుకుని భావించిన మెగా ఫ్యాన్స్.. సినిమాలోని సాంగ్స్ సినిమాకి ఏ మాత్రం ప్లస్ అయ్యేలా కనిపించడం లేదని, తమన్ డిజప్పాయింట్ చేశాడని తెగ ట్రోల్ చేస్తున్నారు.


'వకీల్ సాబ్', 'భీమ్లానాయక్' లాంటి పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ ‘బ్రో’కి ఇంత డిజాస్టర్ మ్యూజిక్ ఇవ్వడంతో అభిమానులు విమర్శలు చేస్తున్నారు. పవన్ సినిమాని గ్రాంటెడ్ గా తీసుకున్నాడని, అందుకే పెద్దగా పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన ట్యూన్లిచ్చి జనాల మొహాన పడేశాడని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రోల్స్‌పై స్పందించారు. సినిమాకు ఎంత వరకు కావాలో అంతవరకే సాంగ్స్ ను క్రియేట్ చేశారని చెప్పారు. "ప్రతీ సినిమాలో హై రేంజ్ లో పాటలేం ఉండవు. కథను బట్టి పాటలు ఉంటాయి. అలాగే ‘బ్రో’ విషయానికొస్తే ఈ సినిమాలో సాంగ్స్ పై అంత ఫోకస్ చేయలేదు. నాకు తెలంగాణతో ఉన్న బంధాన్ని ఈ సినిమాలో చూపించాం. ఈ క్షణం ఎలా బతకాలి అన్న విషయంపైనే ఈ సినిమా అంతా ఉంటుంది. సాంగ్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి.. పోతుంటాయి" అని సాయి ధరమ్ తేజ్ చెప్పారు.


ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కు వచ్చిన రియాక్షన్ పై ఇటీవల తమన్ చేసిన వ్యాఖ్యలపైనా సాయి ధరమ్ తేజ్ స్పందించారు. 'బ్రో' సినిమాలో అందరూ ముందుగా పవన్ కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అవుతుందనుకున్నారు.. కానీ సాయి ధరమ్ తేజ్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ గా ఫీలవుతున్నారని, అందుకే ఈ రెస్పాన్స్ వస్తోందని ఈ మధ్యే తమన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కి అయితే ఒకలా, సాయి ధరమ్ తేజ్ కి అయితే మరోలా సాంగ్స్ చేస్తారా అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ అలాంటిదేం ఉండదని, సినిమాలోని కథను బట్టి సాంగ్స్ ఉంటాయని తాజాగా సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. 


ఇదిలా ఉండగా బ్రో సినిమాను జులై 28న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు టైం ఉన్నా సినిమాపై అసలు ఎలాంటి హైప్ లేకపోవడం, ప్రమోషన్స్ కూడా సరిగ్గా చెయట్లేదని మెగా ఫ్యాన్స్ చాలా నిరుత్సాహ పడుతున్నారు.


Read Also : దేవరకొండ బ్రదర్స్‌ను మెగా బ్రదర్స్‌తో పోల్చిన నిర్మాత బన్నీ వాసు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial