ప్రముఖ రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ రమణ (70) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు (జులై 19) బుధవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న 'మిథునం' సినిమాకు కథ అందించారు. బాపు, రమణ వంటి దిగ్గజాలతో కలిసి పని చేసిన అనుభవం ఆయనది. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి చెందారు.


శ్రీరమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. కలం పేరు శ్రీరమణ. అసలు పేరు కన్నా కలం పేరుతోనే ఆయన బాగా పాపులర్ అయ్యారు.  ఆంధ్రజ్యోతి ‘నవ్య’ వారపత్రికకు ఎడిటర్‌గా పని చేసిన ఆయన.. సాక్షి పత్రికలో 'అక్షర తూణీరం' అనే పేరుతో చాలా ఏళ్ళు వ్యంగ్యభరిత వ్యాసాలు రాసారు. 


25 పేజీల 'మిథునం'


శ్రీరమణ రాసిన 25 పేజీల 'మిథునం' నాటిక ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాదాపు పాతికేళ్ల క్రితం ఆయన రచించిన కథను సీనియర్ నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి 'మిథునం' సినిమాగా తెరకెక్కించారు. ఏఎంఆర్ బ్యానర్ పై మొయిద ఆనందరావు నిర్మించారు. ఇందులో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ నటి లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కేవలం రెండు పాత్రలతో తీసిన ఈ డ్రామా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. హాస్య భరిత కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా సాహిత్య, కళా రంగాలకు విశిష్ట సేవలందించారు శ్రీరమణ. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.


ఈ ఏడాది మార్చిలో కన్నుమూసిన 'మిథునం' నిర్మాత


ఇకపోతే 'మిథునం' నిర్మాత ఆనందరావు (57) కూడా ఈ ఏడాదే కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న ఆనందరావు.. పరిస్థితి విషమించడంతో 2023 మార్చి 16న మృతి చెందారు. ఆయన స్వగ్రామంలో 25లక్షలు ఖర్చు చేసి గ్రంథాలయం ఏర్పాటు చేసిన ఆయనకు గొప్ప సమాజ సేవకుడిగా పేరుంది. 'మిథునం' నిర్మాణంలోనే కాదు, స్క్రీన్ ప్లే రైటింగ్ లోనూ ఆనందరావు భాగం పంచుకున్నారు. ఆయన మరణించిన నాలుగు నెలలకు ఇప్పుడు కథా రచయిత శ్రీరమణ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 


'మిథునం' సినిమా విశేషాలు


శ్రీరమణ రచించిన కేవలం 25 పేజీల 'మిథునం' కథను తనికెళ్ళ భరణి, పూర్తి సినిమాగా మార్చేసారు. 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ జీవితాన్ని ఎలా గడిపారనే ఇతివృత్తంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి. దీనికి దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, సీనియర్ నటులు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు వాయిస్ ఓవర్ అందించారు. 2012 డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, కమర్షియల్ గానూ మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు నంది పురష్కారాలు అందాయి. ఇదే క్రమంలో పలు అంతర్జాతీయ అవార్డులకు కూడా నామినేట్ అయింది.


Read Also: Cult Films: ‘కల్ట్’ సినిమా? ఇప్పుడిదే నయా ట్రెండ్ - ఈ సినిమాలకు ఆ క్రెడిట్ ఇవ్వొచ్చు అంటారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial