ప్పుడు టాలీవుడ్ లో 'కల్ట్' అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. 'కల్ట్ సినిమా' అందించామని 'బేబీ' చిత్ర నిర్మాతలు చెబుతుంటే.. 'యునిక్ కల్ట్ మూవీ' తీశామని 'హిడింబ' మేకర్స్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు కల్ట్ సినిమా అంటే ఏంటి? ఎలాంటి చిత్రాలని ఆ జాబితాలో చేరుస్తారు? అంటూ 'కల్ట్' గురించే ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు.


1931 నుంచి మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. మేకింగ్ లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన సినిమాలను, ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన చిత్రాలను 'కల్ట్ ఫిల్మ్స్' గా చెప్పుకునేవారు. మాయాబజార్, దాన వీర శూర కర్ణ, శంకరా భరణం, సాగర సంగమం, గీతాంజలి, శివ, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆదిత్య 369 వంటి చిత్రాలు ఇదే కోవకు చెందుతాయి. ఎందుకంటే.. ఈ మూవీస్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆరాధించారు. వాటిని ఇప్పటికీ మైండ్‌ నుంచి తీయలేం.


అయితే రాను రాను సినీ పరిభాషలో 'కల్ట్' అనే పదానికి అర్థాలు మారుతూ వచ్చాయి. కొన్నాళ్లకు బోల్డ్ కంటెంట్ తో కాస్త వైల్డ్ గా తెరకెక్కే సినిమాలను కల్ట్ గా పేర్కొంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో మాత్రం హీరోయిన్ల డార్క్ షేడ్ ను చూపించిన చిత్రాలని కల్ట్ గా భావిస్తున్నారని చెప్పాలి.


గతంలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వచ్చిన A, రా, ఉపేంద్ర వంటి సినిమాలు అమ్మాయిల డార్క్ సైడ్ ను తెర మీద చూపించాయి. ఇవి అప్పటి యువతరాన్ని విపరీతంగా కట్టుకోవడంతో, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాల్లోని సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.


అప్పట్లో 'మన్మధ' వంటి డబ్బింగ్ సినిమా యూత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ హీరోని మోసం చేసే విధానం హైలైట్ గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిపింది. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన 'అర్జున్ రెడ్డి' చిత్రం ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవ్ స్టోరీని వైల్డ్ గా ప్రెజెంట్ చేసిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.


Read Also: మెగాస్టార్ టూ సూపర్ స్టార్, గుండుతో దర్శనమిచ్చిన హీరోలు వేరే!


నేటి తరం అమ్మాయిల భావాలకు అద్దం పట్టే కంటెంట్ తో తెరకెక్కిన 'కుమారి 21F' సినిమా కూడా మంచి హిట్టయింది. అలానే హీరోయిన్ ను బ్యాడ్ గా చిత్రీకరిస్తూ, అమ్మాయిలలోని నెగెటివ్ షేడ్స్ ను చూపిస్తూ దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన 'RX 100' సినిమా సంచలన విజయం సాధించింది. 'బోల్డ్' షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రతో తీసిన 'DJ టిల్లు' మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.


ఇప్పుడు లేటెస్టుగా బోల్డ్ కంటెంట్ తో న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'బేబీ' సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఇదొక కల్ట్ బొమ్మ అని నిర్మాత తొడకొట్టి మరీ చెబుతున్నారు. ఈ సినిమాలో 'Rx 100' ఛాయలు కాస్త కనిపించినప్పటికీ.. హీరోయిన్ క్యారెక్టర్ ను కాకుండా, చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెను ఎలా మార్చాయనే కోణంలో ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హీరోయిన్ రోల్ ను డార్క్ గా, బోల్డ్ గా చూపించారు. దీని కారణంగా లవ్ కంటే లస్ట్ ఎక్కువైందనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయినప్పటికీ యూత్ ఆడియన్స్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపిస్తున్నారు. 


ఇదంతా బాగానే వుంది కానీ, ఇదిలాగే కొనసాగితే 'కల్ట్ సినిమా' అంటే బోల్డ్ కంటెంట్ తో తీయాల్సిందేనని అనుకునే ప్రమాదం వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మూడు శృంగార సన్నివేశాలు జోడిస్తే అది కల్ట్ సినిమా అవుతుందని అనుకోవడం.. ఇప్పటితరానికి నచ్చుతుందని అదే పనిగా బూతులు, అడల్ట్ సీన్స్ పెడితే కల్ట్ సినిమా స్టేటస్ వచ్చేస్తుందని భావించడం సరికాదని అంటున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే, ఇప్పుడు కల్ట్ అనేది ట్రెండ్ గా మారింది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి 'కల్ట్' చిత్రాలు వస్తాయో చూడాలి.


Read Also: Bigg Boss Telugu 7: కుడి ఎడమైతే పొరపాటు లేదో, 'బిగ్ బాస్' ప్రోమోతో తిరిగొచ్చిన కింగ్ నాగ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial