తెలుగు ప్రేక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని పరిచయం చేసిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచిన ఈ కార్యక్రమం.. తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది. ఎన్ని వివాదాలు చెలరేగినా, ఎన్నో విమర్శలు వచ్చినా ఆడియన్స్ మాత్రం ఈ షోకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే అత్యధిక టీఆర్పీతో 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్.. ఇప్పుడు 7వ సీజన్ తో మరింత వినోదాన్ని అందించడానికి సరికొత్తగా రెడీ అవుతోంది.
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు-7 షోకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారమవుతుందని.. ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు ఉంటాయని నిర్వాహకులు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని పంచుకున్నారు. స్టార్ మా మరియు డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా హోస్ట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. సరికొత్త ప్రోమోని రిలీజ్ చేసారు.
'బిగ్ బాస్ తెలుగు' 7వ సీజన్ కు కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించబోతున్నారు. గతంలో నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా ఉన్న నాగ్.. ఇప్పుడు లేటెస్ట్ సీజన్ లోనూ సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ''బిగ్ బాస్ గురించి మీకు తెలిసిందని మీరు అనుకున్నదంతా విప్లవాత్మకంగా మారబోతోంది! మీకు అత్యంత ఇష్టమైన నాగార్జునతో ఈ సీజన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?! గందరగోళంగా ఉందా? ఉత్సాహంగా ఉందా? Bigg Boss Telugu-7 గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి'' అని 'స్టార్ మా' ఇంస్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలోకి వెళ్తే.. ఈసారి సీజన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడానికి నాగార్జున ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో చూపించారు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదో' అని నాగ్ పాట పాడుతూ తనదైన శైలిలో చిటికె వేయడంతో, బ్యాగ్రౌండ్ లో ఉన్న వస్తువులన్నీ గాల్లోకి ఎగురుతున్నట్లు చూపించి ఆసక్తిని రేకెత్తించారు. సెటప్ అంతా చూస్తుంటే ఈసారి సరికొత్త థీమ్ తో 'బిగ్ బాస్' సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు-7 ప్రోమో రిలీజైన కొన్ని నిమిషాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో నాగార్జున ట్రెండీ కాస్ట్యూమ్స్ లో చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా కనిపించారు. రఫ్ గా కనిపించే గడ్డం, రింగులు తిరిగిన జుట్టు ఆయనకు ఆకర్షణగా నిలిచాయి. కింగ్ నాగ్ మునుపటి కంటే మరింత ఉత్సాహంగా ఈ సీజన్ కోసం రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.
నాగార్జున ఇప్పటి వరకు వచ్చిన ఆరు సీజన్లలో 3, 4, 5, 6 సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కూడా ఆయనే హోస్ట్. హౌస్ లో కంటెస్టెంట్లను నాగ్ డీల్ చేసే విధానం.. వారితో వ్యవహరించే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే వీకెండ్ లో మంచి టీఆర్పీలు నమోదవుతుంటాయి. అయినప్పటికీ బిగ్ బాస్ 7వ సీజన్ కు నాగ్ హోస్టింగ్ చేయరని, సరికొత్త హోస్ట్ వచ్చే అవకాశం ఉందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే నిర్వాహకులు ఈసారి కూడా కింగ్ వైపే మొగ్గు చూపారు. త్వరలో కంటెస్టెంట్స్ ఎంపిక మరియు షో స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.
Read Also: మెగాస్టార్ టూ సూపర్ స్టార్, గుండుతో దర్శనమిచ్చిన హీరోలు వేరే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial