Etala Meets Raja singh : భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి చాలా కాలం అయింది. వివాదాస్పద వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ ఆయనను సస్పెండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో విడుదల అయ్యారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని తర్వాత తెలంగాణ బీజేపీ శాఖ కూడా హైకమాండ్‌కు సిఫారసు చేసింది. కానీ హైకమాండ్ మాత్రం నిర్ణయం తీసుకోలేదు.
సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడంతో రాజాసింగ్‌లో అసంతృప్తి
సస్పెన్షన్ ఎత్తి వేస్తారో లేదో నన్న కంగారులో రాజాసింగ్ ఉన్నారు. ఆయన ఓ సారి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. ఇటీవల మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లి మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది. ఇతర పార్టీల నేతల్ని కలిసినప్పుడల్లా ఆయన పార్టీ మారడానిక ిరంగం సిద్ధమయిందన్న ప్రచారం జరుగుతోంది. కానీ రాజాసింగ్ మాత్రం.. తాను బీజేపీకే కరెక్ట్ అని ఇతర పార్టీల్లో ఇమడలేనని అంటున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ రాజాసింగ్ ఇంటికి వెళ్లి సమావేశం కావడంతో.. ఆయన పక్క చూపులు చూడవద్దని బుజ్జగించడానికేనని అంటున్నారు.
కార్యకర్తలను కాపాడుకుంటామన్న ఈటల రాజేందర్
ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై , కార్పొరేటర్ పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని రాజాసింగ్ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులు పట్ల కక్షపురితంగా వ్యవహరిస్తుందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎలా అయినా గెలవాలని తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని ఈటల తెలిపారు. బీజేపీ నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతాననని ఈటల తెలిపారు.
సస్పెన్షన్ పై హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్న ఈటల
రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని.. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తి వేయకపోతే.. సొంత పార్టీ పెట్టుకోవడం లేదా.. ఉద్దవ్ ధాకరే శివసేన పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేసి.. అభ్యర్థిగా పోటీ చేయడం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా సస్పెన్షన్ ఎత్తి వేస్తారని.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని.. రాజాసింగ్ కు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.