Delhi Girl Attacked with Knife:


ఆదర్శ్ నగర్‌లో దారుణం..


దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఏదో ఓ ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పుడు మరో సంఘటన జరిగింది. తనను దూరం పెడుతోందన్న కోపంతో ఓ యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో మూడు నాలుగు సార్లు పొడిచాడు. ఆదర్శ్ నగర్‌లో జరిగిందీ దారుణం. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. వీళ్లిద్దరికీ ముందుగానే పరిచయం ఉంది. అయితే...ఆ యువతి ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పింది. దీనిపై ఆగ్రహం చెందిన యువకుడు ఇలా కత్తితో దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. జనవరి 2వ తేదీన ఈ దాడి జరిగింది. యువతి తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో మరెవరూ లేరు. ఇది గమనించిన యువకుడు ఆమెను వెంబడించాడు. మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ తరవాత కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, వైద్యం అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు..ఆ వ్యక్తి పేరు సుఖ్వీందర్ సింగ్ అని గుర్తించారు. అయితే..అప్పటికే ఢిల్లీ నుంచి అంబాలాకు పరారయ్యాడు. వెంటనే పోలీసులు అంబాలాకు వెళ్లి నిఘా పెట్టి పట్టుకున్నారు. 






యాసిడ్ దాడి..


గతంలో ద్వారకా మోడ్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న 17 ఏళ్ల విద్యార్థినిపై బైక్‌ వచ్చిన ఓ వ్యక్తి యాసిడ్ చల్లి పారిపోయాడు. ఆ మంట తట్టుకోలేక ఒక్కసారిగా పరుగులు పెట్టింది బాధితురాలు. ఆమెకు సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు.  నిందితుడు బాలికకు తెలిసిన వ్యక్తేనని వెల్లడైంది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలు...స్కూల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఆ  సమయంలో బాధితురాలితో పాటు పక్కనే తన చెల్లెలు కూడా ఉందని చెప్పారు.  దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. ఉదయం 7.30 నిముషాలకు ఇంటి నుంచి బయటకు వచ్చారని, కొంత దూరం వెళ్లిన వెంటనే ఈ దాడి జరిగిందని చెప్పారు. నిందితులు మాస్క్‌ పెట్టుకుని దాడి చేశారు. తనను వెంబడిస్తున్నారని కానీ... వేధిస్తున్నారని కానీ తన కూతురు ఎప్పుడూ చెప్పలేదని తల్లిదండ్రులు వెల్లడించారు. స్పెషల్ సీపీ చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు సచిన్ అరోరాతో ఒకప్పుడు బాధితురాలు సన్నిహితంగా ఉండేది. రెండు మూడు నెలలుగా అతడిని దూరం పెట్టింది ఆ అమ్మాయి. ఆ కోపంతోనే దాడి చేసినట్టు నిందితుడు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక యాసిడ్‌ ఎక్కడ కొన్నారన్న ప్రశ్నకూ నిందితుడు సమాధానం చెప్పాడు. ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్‌ కొనుగోలు చేసినట్టు చెప్పాడు. ఈ నిందితుడికి మరో స్నేహితుడు వీరేంద్ర సింగ్ సహకరించాడు". 


Also Read: Kanjhawala Case: తల చీలిపోయింది, ఎముకలు విరిగిపోయాయి - కంజావాలా కేసులో యువతి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ సంచలనం