Delhi Crime News: 


ఢిల్లీలో దారుణం..


ఢిల్లీలోని సరితా విహార్‌లో పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. చిన్నగా మొదలైన గొడవ కాసేపట్లోనే పెద్దగా మారింది. ఆరుగురు ఓ ఇంట్లోకి వెళ్లి ఘర్షణకు దిగారు. మాటమాట పెరిగి కత్తితో ఆ ఇంట్లోని వ్యక్తిని పొడిచి చంపారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారు. ఆరుగురు దుండగులు బైక్‌పై వచ్చి దాడి చేశారని, అరవింద్ మండల్‌ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపారని చెప్పారు. ఈ సమాచారం అందిన వెంటనే ఓ పోలీస్ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు. బైక్ పార్కింగ్ విషయంలో ఓ వ్యక్తితో అరవింద్ మండల్ గొడవ పడ్డాడని విచారణలో తేలింది. అప్పటికప్పుడు ఇద్దరూ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కానీ కాసేపటికి ఆ గొవడ సద్దుమణిగింది. కానీ రాత్రి పూట ఒకేసారి గ్యాంగ్ వచ్చి అరవింద్ ఇంటిపై దాడి చేసింది. పదునైన ఆయుధంతో అరవింద్‌తో పాటు అతని భార్యపైనా దాడి చేశారు దుండగులు. తీవ్ర గాయాల పాలైన అరవింద్‌ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. FIR నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 


ఇటీవలే ఓ దారుణం..


ఢిల్లీలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...మహమ్మద్ జాకీర్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో టెక్నికల్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. సహోద్యోగి నుంచి లోన్ తీసుకున్నాడు. చాన్నాళ్లుగా అది తిరిగి చెల్లించలేదు. సహనం కోల్పోయిన ఆ మహిళ డబ్బులు కట్టాలని నిలదీసింది. ఈ కోపంతోనే జాకీర్ ఆమె మెడపై కత్తితో పొడిచాడు. మెడపైనే చాలా సార్లు పొడిచిన గాయాలు కనిపించాయి. ఆ తరవాత ఆమె ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా యాసిడ్ పోశాడు. బాధితురాలు అదే రైల్వే స్టేషన్‌లో క్లర్క్‌గా పని చేస్తోంది. పర్సనల్‌ లోన్‌ కింద 2018,2019లో దాదాపు 11 లక్షల వరకూ ఇచ్చింది. వీటిని తీర్చలేక ఆమెను హత్య చేశాడు జాకీర్. మెట్రో స్టేషన్‌ వద్ద ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 8 వ తేదీ నుంచి తన తల్లి కనిపించడం లేదని బాధితురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లెయింట్ ఆధారంగా విచారణ చేపట్టారు. సెప్టెంబర్ 9వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి "మీ అమ్మ చనిపోయింది" అని చెప్పాడు. వెంటనే పోలీసులను అలెర్ట్ చేశారు కుటుంబ సభ్యులు. ఆ తరవాతే విచారణ మొదలు పెట్టి జాకీర్‌ని నిలదీశారు. స్విచ్ఛాఫ్‌ అవడం వల్ల లొకేషన్ ట్రేస్ చేయడం కష్టమైంది. దాదాపు 60 ప్రాంతాల్లో 20 గంటల పాటు తనిఖీలు చేసి చివరకు అరెస్ట్ చేశారు. డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేసినందుకే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. 


Also Read: కొలీగ్ వేలు కొరికినందుకు ఇండియన్‌కి పది నెలల జైలు శిక్ష, సింగపూర్‌లో అంతే