నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయాలకు ఓ దళిత యువకుడు బలయ్యాడు. స్థానిక రాజకీయ నాయకుల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. పలువురు రాజకీయ నాయకుల కారణంగానే తాను చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ అతడు రాసిన మరణ వాంగ్మూలం కలకలం రేపుతోంది. మరోవైపు.... దళితులు మరణించిన తర్వాత కూడా వివక్షకు గురవుతూనే ఉన్న పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి మరణిస్తే ఖననం చేయకుండా అడ్డుకున్నారు కొెెందరు వ్యక్తులు. ఏళ్లుగా ఇదే సమస్య ఎదురవుతున్నా అధికారులు పరిష్కారం చూపకపోవడం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నా చావుకి వారే కారణం


నెల్లూరు జిల్లా కావలిలో ముసునూరు హరిజనపాలెంలో నివాసం ఉండే దుగ్గిరాల కరుణాకర్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, సురేశ్ రెడ్డి తన చావుకి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి అతడు ఉరేసుకుని చనిపోయాడు. 20లక్షల రూపాయలు అప్పులు చేసి చెరువులో చేపలు పెంచితే, మూడేళ్లుగా వాటిని పట్టనివ్వడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి కూడా వైసీపీ నేతల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కరుణాకర్ సూసైడ్ లెటర్ రాసినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


శ్మశానవాటికపై వివాదం


సత్యసాయి జిల్లాలో ఓ వ్యక్తి మరణించిన తర్వాత ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలం గురించి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి మండలం కొండూరు గ్రామంలో ఏళ్ల తరబడి దళితులు శ్మశాన వాటిక విషయంలో వివాదంతో ఇబ్బందులు పడుతున్నారు. దళితులు ఎవరైనా మరణిస్తే ఆ గ్రామంలో పోలీసుల సమక్షంలో ఖననం చేయాల్సిన దుస్థితి. అప్పటికి ఏదో తాత్కాలిక చర్యలు చేపట్టడం తప్ప స్మశాన వాటిక సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. 


ఖననం చేయనిచ్చేది లేదు


కొండూరు గ్రామంలో శుక్రవారం రాత్రి దళిత రామయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. శవాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్తుండగా అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి  చెందిన రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. శ్మశాన వాటికలో 22 సెంట్ల భూమి తనదే అయినందున దళితులను ఖననం చేసేందుకు వీల్లేదని ఆయన భీష్మించారు. తరచూ ఇదే సమస్య ఎదురవుతున్నా ప్రభుత్వ అధికారులు సమస్యకు పరిష్కారం చూపడంలో విఫలమయ్యారు. దళితులు ఎవరైనా చనిపోతే రెండు, మూడు రోజులు వారి కుటుంబ సభ్యులు ధర్నాలు, నిరసనలు తెలిపితే తప్ప ఖననం చేసేందుకు వీలు కలగడం లేదు. పోలీసులు, ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారే తప్ప శాశ్వత ఏర్పాటు చేయడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొండూరు గ్రామంలో దళితులకు స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.