జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సంజు శామ్సన్ (43 నాటౌట్: 39 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయం భారత్ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మూడో వన్డే జులై 22వ తేదీన విజయం సాధించింది.


మళ్లీ 200 లోపే!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఇన్నింగ్స్ మెల్లగా ప్రారంభం అయింది. మొదటి ఎనిమిది ఓవర్లలో వారు చేసింది కేవలం 20 పరుగులు మాత్రమే. తొమ్మిదో ఓవర్లో ఓపెనర్ కైటానోను (7: 32 బంతుల్లో) అవుట్ చేసి మహ్మద్ సిరాజ్ టీమిండియాకు మొదటి వికెట్ అందించారు.


మరో ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (16: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), కెప్టెన్ రెగిస్ చబాగ్వాలను (2: 5 బంతుల్లో) శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి వన్ డౌన్ బ్యాటర్ వెస్లీ మదెవెరెను (2: 12 బంతుల్లో) ప్రసీద్ కృష్ణ అవుట్ చేయడంతో జింబాబ్వే 12 ఓవర్లలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఈ దశలో సికిందర్ రాజా (16: 31 బంతుల్లో), షాన్ విలియమ్స్ (42: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జింబాబ్వేను ఆదుకున్నారు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీళ్లు అవుటయ్యాక ర్యాన్ బుర్ల్ (39 నాటౌట్: 47 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఒకవైపు నిలబడ్డా మరో ఎండ్‌లో తనకు సహకారం లభించలేదు.


దీంతో జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటయింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడాలు తలో వికెట్ పడగొట్టారు. బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరికీ వికెట్ దక్కడం విశేషం.


చివర్లో అదరగొట్టిన సంజు శామ్సన్
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ బదులు కేఎల్ రాహుల్ ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చాడు. అయితే ఈ ప్లాన్ పని చేయలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్ (1: 5 బంతుల్లో) అవుటయ్యాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన శిఖర్ ధావన్ (33: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు) కూడా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో పెవిలియన్ బాట పట్టాడు. టూ డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (6: 13 బంతుల్లో) కూడా విఫలం కావడంతో భారత్ 83 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (33: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు) ఈ మ్యాచ్‌లో కూడా రాణించాడు. అయితే ఇషాన్ కిషన్ అవుటైన కాసేపటికే గిల్ కూడా అవుట్ కావడంతో భారత్ 97 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీపక్ హుడా (25: 36 బంతుల్లో, మూడు ఫోర్లు), సంజు శామ్సన్ (43 నాటౌట్: 39 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మంచి భాగస్వామ్యం ఏర్పరచారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. గెలుపుకు తొమ్మిది పరుగుల దూరంలో దీపక్ హుడా అవుటైనా సంజు శామ్సన్, అక్షర్ పటేల్‌తో (6: 7 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి మ్యాచ్‌ను ముగించాడు.