IND vs ZIM 2nd ODI: జింబాబ్వేతో రెండో వన్డేలో దీపక్ చాహర్‌ను (Deepak Chahar) పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి మ్యాచులో బంతితో దుమ్మురేపిన అతడిని ఎందుకు తీసుకోలేదని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కెప్టెన్సీని విమర్శిస్తున్నారు. అసలు కారణం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.


రెండో వన్డే తుది జట్టును చూడగానే టీమ్‌ఇండియా అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీపక్‌ చాహర్‌ లేకపోవడమే ఇందుకు కారణం. తొలి వన్డేలో అతడు ఏకధాటిగా ఏడు ఓవర్లు వేసి జింబాబ్వేను భారీ దెబ్బకొట్టాడు. కేవలం 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాంటి ప్రదర్శన చేసిన యువ పేసర్‌ను ఒక్క మ్యాచుకే తొలగిస్తారా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా అని మరికొందరు సందేహాలు లేవనెత్తుతున్నారు.


ఐపీఎల్‌ 2022కు ముందు దీపక్‌ చాహర్‌ గాయపడ్డాడు. వెన్నెముక, క్వాడ్రాసిప్స్‌ గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాతా అతడు కోలుకోలేదు. దాదాపుగా ఆరు నెలలు బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. ఫిట్‌నెస్‌ సాధించడంతో జింబాబ్వే సిరీసుకు ఎంపిక చేశారు.


బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసిన చాహర్‌ పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అయితే రెండో వన్డేలోనే అతడిని పక్కన పెట్టడంతో ఫిట్‌నెస్‌పై అనుమానాలు కలుగుతున్నాయి. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పనిభారం పర్యవేక్షణలో భాగంగా అతడిపై ఒత్తిడి తగ్గించేందుకు ఇలా చేశారా అని మరికొందరు అడుగుతున్నారు.


టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, యువ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఇప్పటికే గాయాల పాలయ్యారు. ఆసియా కప్‌కు దూరమయ్యారు. టీ20 ప్రపంచకప్‌ గెలవాలంటే వీరిద్దరూ హిట్‌మ్యాన్‌ సేనకు అత్యంత కీలకం. సరే, వీరి గైర్హాజరీలో చాహర్‌ అందుబాటులోకి వచ్చాడని సంతోషించే లోపే మళ్లీ గాయాల భయం వెంటాడుతుండటం గమనార్హం.