Power Exchange Trading Ban: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షాకుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మత్తు వదిలింది! డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్కరోజులోనే 80 శాతం తగ్గిపోయాయి. శుక్రవారం రూ.5100 కోట్లుగా ఉన్న బకాయిలు శనివారానికి రూ.1,037 కోట్లకు తగ్గాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. కొందరు డబ్బులు చెల్లించగా, ఇంకొందరు వివాద పరిష్కారం మార్గం ఎంచుకున్నారని తెలిసింది. కొన్నేళ్లుగా డిస్కమ్‌ల బకాయిలు చెల్లించకపోవడంతో పవర్ ఎక్స్‌ఛేంజీల్లో స్వల్ప కాలానికి విద్యుత్ కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, జమ్ము-కశ్మీర్, బిహార్, మిజోరం, ఝార్ఖండ్, రాజస్థాన్‌లు విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు చేపట్టకుండా కేంద్రం నిషేధించింది. ఫలితంగా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉంటాయని భావించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడ్డా రాష్ట్రాలు వెంటనే బకాయిలు చెల్లించేశాయి.
మొత్తంగా డిస్కమ్‌లకు రూ.లక్ష కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములాను సిద్ధం చేసింది. 48 విడతల్లో కట్టాలని చెప్పింది. బిహార్, మణిపుర్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలు డబ్బులు చెల్లించాయి. రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు బకాయిలు తీర్చేశామని మహారాష్ట్ర తెలిపింది. ఇప్పటికైతే తాము చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని స్పష్టం చేయడంతో గురువారం అర్ధరాత్రి నుంచి చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, మణిపుర్‌కు విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.
ఇదే సమయంలో ఇండియన్ ఎలక్ట్రానిక్ ఎక్స్‌ఛేంజీలో (IEX) రియల్ టైమ్ మార్కెట్ (RTM) ధరలు గరిష్ఠానికి చేరుకున్నాయి. గురువారం రాత్రి యూనిట్ ధర రూ.7గా ఉండగా శుక్రవారం రూ.12కు చేరుకుంది. ఈ సెగ్మెంట్లో సగటు యూనిటి్ ధర రూ.4.16 నుంచి రూ.5.46కు పెరిగింది.
లేఖ రాసిన తెలంగాణ
కేంద్ర నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం రియల్‌టైం మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ఏపీ ఇంధన శాఖ అధికారులు తెలిపారు. పీక్ డిమాండ్ సమయంలో రోజుకు 10-15 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం అవుతుందన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్ ద్వారా విద్యుత్ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. విద్యుత్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఏపీ పేరు తొలగింపు
కేంద్రం విద్యుత్ కొనుగోళ్ల నిషేధంపై ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పందించారు. పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని తెలిపారు. సమాచారం లోపం వల్లే విద్యుత్ కొనుగోళ్ల నిషేధిత జాబితాలో ఏపీని చేర్చారని తెలిపారు. విద్యుత్ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదన్నారు. ఏపీ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.350 కోట్లు చెల్లించేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఏపీ పేరు తొలగించారని విజయానంద్ తెలిపారు.