తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించారు. దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి లేఖ విడుదలైంది. ఈ వ్యవహరం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా ఆమె పార్టీ ఇన్‌చార్జ్‌గానే కొనసాగుతున్నారు. అయితే తాజాగా అదనపు సమన్వయకర్త హోదాను సృష్టించి మరి ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించటంపై శ్రీదేవి వర్గం అసంతృప్తిగా ఉంది.
సుచరిత ఇంటి ముందు ఆందోళన...
తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించటంపై ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుచురులు కూడ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ వ్యవహరంపై జిల్లా పార్టీ అద్యక్షురాలు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితతో చర్చించేందుకు గుంటూరులోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున అనుచరులతో ఎమ్మెల్యే శ్రీదేవి తరలివచ్చారు. అయితే సుచరిత ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఇంటి వద్దనే శ్రీదేవి, ఆమె అనుచరులు చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సుచరిత బయటకు రావాలంటూ ఇంటి ముందు ఆందోళనకు దిగటంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
డొక్కా వచ్చిందే అందుకా....
ఎమ్మెల్సీగా టీడీపీలో కొనసాగిన డొక్కా మాణిక్య వరప్రసాద్, 2020లో వైసీపీలో చేరారు. అయితే ఆయన్ని పార్టీలోకి తీసుకురావటం వెనుక తాడికొండ రాజకీయం ఉందనే అనుమానాలు ఆనాడే వ్యక్తం అయ్యాయి. దీంతో తాడికొండ నియోజకవర్గంలో రాజకీయాలు నడిపితే సహించేది లేదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మొదట్లోనే పంచాయితీ పెట్టారు. అయితే పార్టీలోకి వచ్చిన తరువాత డొక్కాకు తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో అంతా కామ్ అయిపోయింది.
తాజాగా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్త పేరుతో డొక్కాకు బాధ్యతలు ఇస్తూ లేఖ బయటకు రావటంతో దుమారం మరోసారి మొదలైంది. డొక్కా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా ఆయన పని చేశారు. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన ప్రాంతం. రాజకీయం అంతా ఇక్కడే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో డొక్కాకు ప్లాన్ ప్రకారమే బాధ్యతలు అప్పగించినట్లుగా ప్రచారం జరుగతుంది
శ్రీదేవి ఇక వెళ్ళండి....
ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి పని తీరుపై పార్టీలో ఆది నుంచి సంచలనంగానే మారింది. శ్రీదేవి వ్యవహరంపై వివాదాలు రావటం, నిత్యం వార్తల్లో ఉండటం, పార్టీకి ఇబ్బందిగా మారింది. డాక్టర్ వృత్తిని వదులకొని రాజకీయాల్లోకి వచ్చిన శ్రీదేవికి జగన్ పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వటంతో జగన్ సునామీలో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అది కూడా రాజధాని ప్రాంతంగా ఉన్న తాడికొండ ప్రాంతం కావటంతో హాట్ సీట్‌గా మారింది. అయితే ఎమ్మెల్యే శ్రీదేవిపై పార్టీలోనే అసంతృప్తులు పుట్టుకొచ్చారు. ఆమె గెలుపు కోసం కృషి చేసిన నాయకులు కూడా ఆమెకు వ్యతిరేకంగా పని చేయటం కలకలం రేపింది. ఇసుక తరలింపు వ్యవహరంలో బాపట్ల ఎంపీ సురేష్‌తో శ్రీదేవికి విభేదాలు బహిర్గంకావటం, ఆ తరువాత ఆ వ్యవహరలో పార్టీ పెద్దలు పంచాయితీ పెట్టి మరి ఇరువురి మధ్య సయోధ్య కుదర్చటం వంటి వ్యవహరాలు అనేకం జరిగాయి. శ్రీదేవి వ్యవహరంపై పార్టీలో వ్యతిరేకత రావటంతో, ఆమెను తప్పిస్తారనే ప్రచారం జరుగుతూనే ఉంది. పార్టీలో జరుగుతున్న వ్యవహరాలపై ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ సీనియర్ నాయకుడితో సంప్రదించినా, ఇక వెళ్లండి అని సమాధానం ఇచ్చారని టాక్ నడుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారని సమాచారం.