Tirumala Ministers : దేవుడు అందర్నీ సమానంగా చూస్తాడు. మరి దేవుడు దగ్గర ఉన్న మనుషులు అందర్నీ సమానంగా చూస్తున్నారా ? కనీసం దేవుడి భక్తులనైనా సమానంగా చూస్తున్నారా ? అని ఆలోచిస్తే.. అధికారం ఉన్నోడిదే  దేవుడి మాన్యం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారిని ఒక్క క్షణం దర్శించుకోవడానికి లక్షల మంది వస్తూ ఉంటారు. అలాంటి వారికి గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సి ఉంటుంది. కానీ మంత్రులైతే చాలు... వారికే కాదు వారి అనుచరులకు కూడా వీఐపీ దర్శనాలు క్షణాల్లో జరిగిపోతాయి. ఇటీవలి కాలంలో మంత్రులు తిరుమలలో చేస్తున్న హడావుడి.. శ్రీవారినే కాదు.. ఆయన భక్తులనూ అవమానించేలా ఉంటున్నాయి. 


రెండు గంటల పాటు శ్రీవారి ఆలయంలో రోజా హల్ చల్ !


తిరుమలకు సామాన్య భక్తులెవరైనా ఏడాదిలో ఒక్క రోజు వెళ్తే అదే మహా దర్శనం అనుకుంటారు. కానీ మంత్రి రోజా మాత్రం వారానికోసారి వీఐపీ దర్శనానికి వెళ్తూంటారు. ఈ సారి ఆమె తన నియోజకవర్గ కార్యకర్తలు యాభై మందిని తీసుకొచ్చారు.  వీఐపీ దర్శనాలు చేయించారు. రెండు గంటల పాటు ఆలయంలో హల్ చల్ చేశారు. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 


రోజానే ఫస్ట్ కాదు..లాస్ట్ కాదు.. మంత్రులంతా ఇంతే !


అయితే ఒక్క రోజానేఇలా కాదు ఇటీవలి కాలంలో తిరుమల కొండను మంత్రులు తమ అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి అవకాశంగా వాడుకుంటున్నారు. తమ తమ నియోజకవర్గాల నుంచి వందల మందిని తీసుకుని తిరుమలకు వస్తున్నారు. అందరికీ వీఐపీ దర్శనాలు చేయించాలని పట్టుబడుతున్నారు. వీరి ఒత్తిడి తట్టుకోలేక సామాన్యభక్తుల్ని నిలిపివేసి దర్శనం చేయిస్తున్నాయి. రోజా కంటే ముందే మరో మంత్రి   ఉషాశ్రీ చరణ్‌ భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసోపియనసమయంలో  సర్వ దర్శనానికి రెండు రోజులు భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితిలో మూడు రోజుల వ్యవధిలో రెండోసారి దర్శనానికి వచ్చారు మంత్రి. 10 మంది అనుచరులకు సుప్రభాత సేవ, 50 మంది అనుచరులను తనతోపాటు దర్శనానికి తీసుకెళ్లారు. భక్తులను ఇబ్బంది పెట్టి తన దర్పాన్ని పదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేసి కూడా.. మీడియా ముందు..  కల్యాణదుర్గం ప్రజలకు దర్శనం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం వారికే చెల్లింది.


జయరాం నుంచి అప్పలరాజు వరకూ అదే బాట !


ఇప్పటి వరకూ  గుమ్మనూరు జయరాం.. వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు తదితరులు ఇదే విధంగా పెద్ద సంఖ్యలో అనుచరులను దర్శనానికి తీసుకొచ్చారు. ఒకేసారి 60 నుంచి 80 మందిని తమతోపాటు ఆలయంలోకి తీసుకెళ్లే వరకు ఊరుకోలేదు. మంత్రి అప్పలరాజు అయితే ఏకంగా 150 మందితో వచ్చి ఆలయం దగ్గర చేసిన యాగి అంతా ఇంతా కాదు. వచ్చిన వాళ్లు అమాత్యులు కావడంతో.. TTD అధికారులు కూడా కాదన లేకపోతున్నారు. నిబంధనలకు నీళ్లొదిలేస్తున్న పరిస్థితి. కళ్లేదుటే సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నా మంత్రులు పట్టించుకోరు. వారూ ప్రజలేనని అనుకోరు.  


పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం !   


ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖపై ఆరుగురికి వీఐపీ దర్శనం కల్పిస్తారు. మంత్రి స్వయంగా వస్తే 10 మంది వరకు అనుమతి ఇస్తారు. కానీ మంత్రులమంటే తమకు సర్వాధికారాలు ఉంటాయని .. వందల మందితో ఆలయంలోకి చొరబడుతున్నారు.   సిఫారసు లేఖల దర్శనాలను ప్రజాప్రతినిధులు వినియోగిస్తున్న తీరు TTD ప్రతిష్టను దెబ్బతీస్తోంది. దీనంతటికి దేవుడి దగ్గర సైతం భయం.. భక్తి లేకుండా వ్యవహరిస్తున్న మంత్రులే కారణం !