Rains In Telangana: ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇదివరకే తీవ్రరూపం దాల్చింది. తాజాగా వాయుగుండంగా మారి గంటలకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశాలోని బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయంగా 250 కి.మీ దూరంలో, పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు తూర్పు ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, సాగర్ దీవులకు ఆగ్నేయంగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఆగస్టు 20న తెల్లారేసరికి ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇదే దిశలో కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను బాలాసోర్, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తరువాత పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపునకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి కొమొరిస్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉత్తర దక్షిణ అల్పపీడన ద్రోణి బలహీనపడింది.


తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. వాయుగుండంగా మారుతుండటంతో దాని ప్రభావం తెలంగాణపై ఉంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయి. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఆగస్టు 21 వరకు రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
తీవ్ర అల్పపీడనం మరింత బలపడిన తరువాత వాయుగుండం ఏర్పడి అది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రాయలసీమలోని నేడు రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.






హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.