దేశీయ మార్కెట్ లో టూ వీలర్ విభాగంలో అత్యంత పాపులర్ అయిన యాక్టివాను హోండా కంపెనీ అదిరిపోయే హంగులతో సరికొత్తగా లాంచ్ చేసింది. హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ పేరుతో జనాలకు పరిచయం చేసింది. సూపర్ లుక్, అంతకు మించిన ఫీచర్లతో ద్విచక్ర వాహన ప్రియులను యాక్టివా లేటెస్ట్ వెర్షన్ అమితంగా ఆకట్టుకుంటుంది. రూ.75,400 ఎక్స్-షోరూమ్ ధరతో ఈ నూతన ఎడిషన్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. దీని ధర DLX వేరియంట్ కంటే రూ. 1,000 ఎక్కువగా ఉంది. STD వేరియంట్ తో పోల్చితే రూ. 3,000 అధికం. యాక్టివా ప్రీమియం ఎడిషన్ ధర కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది.

  


సరికొత్త లుక్.. అదిరిపోయే డిజైన్..


హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ జస్ట్ కాస్మెటిక మార్పులతో వచ్చింది. బంగారు రంగు వీల్స్, ఎంబ్లమ్ మీద గోల్డ్ కలర్ లోగోతో పాటు ఫ్రంట్ క్రోమ్ గార్నిష్ ను కలిగి ఉంది. పక్క వైపు యాక్టివా బ్యాడ్జింగ్ కు బంగారు హంగులు అద్దారు. ఇన్నర్ బాడీ, ఫుట్ బోర్డు, సీటు ప్రస్తుతం గ్రే కలర్ లో వస్తుంది. తాజాగా చేసిన ఈ మార్పులు యాక్టివాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.


ఎన్ని రంగుల్లో వస్తుందంటే..


యాక్టివా లేటెస్ట్ ఎడిషన్ మూడు రంగుల్లో లభించనుంది. మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మ్యాట్ సాంగ్రియో రెడ్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ  కలర్స్ లో కనువిందు చేస్తున్నాయి. అయితే మూడు రంగుల వాహనాల్లోనూ గోల్డ్ షేడ్స్ కామన్ గా ఉన్నాయి.


ఇంజిన్ ప్రత్యేకత..  


గతంలో వచ్చిన యాక్టివా ఇంజిన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లలో ఏ ఛేంజెస్ లేకుండానే కంపెనీ వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 109.51 సీసీ సామర్థ్యం, సింగిల్ సిలిండర్ తో పాటు ఎయిర్ కూల్డ్ ఇంజన్ కొనసాగుతోంది. ఇక  గరిష్టంగా 8,000 ఆర్పీఎం దగ్గర 7.8 హెచ్ పీ  శక్తిని అందిస్తుంది. 5,500 ఆర్పీఎం దగ్గర 8.84 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ ఇంజన్ CVTతో వస్తుంది.


ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


ఫీచర్లను ఓ సారి గమనిస్తే .. ఈ  లేటెస్ట్ టూవీలర్ లో ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉంది. ఎనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అండర్ సీట్ స్టోరేజ్, LED హెడ్‌ ల్యాంప్‌లు, ESP టెక్నాలజీతో వస్తుంది. ఇది సైలెంట్ స్టార్ట్‌ లో ఉపయోగపడుతుంది.  ఇక యాక్టివా ప్రీమియం ఎడిషన్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుంది. స్టీల్ రిమ్‌లతో వస్తుంది. ఇక బ్రేకుల విషయానికి వస్తే… ఫ్రంట్, బ్యాక్ 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ను కలిగి ఉంది. 12-అంగుళాల వీల్‌తో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ ను కలిగి ఉంది.  ఇక స్కూటర్ బరువు 106 కిలోలు ఉండగా.. 5.3 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. 


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?