India T20 WC Squad: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ అలర్ట్‌! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టును ఎంపిక చేసే తేదీ తెలిసింది. సెప్టెంబర్‌ 15న టీమ్‌ఇండియాను ప్రకటిస్తారని సమాచారం. ఇదే నెలలో హిట్‌మ్యాన్ సేన ఆసియాకప్‌ ఆడే సంగతి తెలిసిందే. ఫైనల్‌ ముగిసిన నాలుగో రోజు సెలక్టర్లు ముంబయిలో సమావేశమైన జట్టును ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.


యూఏఈ వేదికగా ఆగస్టు 27న ఆసియా కప్‌ మొదలవుతుంది. సెప్టెంబర్‌ 11న ఫైనల్‌ జరుగుతుంది. దాదాపుగా టీమ్‌ఇండియా ఫైనల్‌ ఆడటం ఖాయమే! ఆటగాళ్లు, సహాయ సిబ్బంది అక్కడ్నుంచి భారత్‌కు వచ్చాక సెలక్టర్లు ముంబయిలో సమావేశం అవుతారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్ల వివరాలను సమర్పించేందుకు సెప్టెంబర్‌ 16 చివరి తేదీ. అందుకే 15న టీమ్‌ఇండియాను ఎంపిక చేస్తారని అంటున్నారు.


ప్రపంచకప్‌నకు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు ప్రతి జట్టుకు అనుమతి ఉంది. క్రికెటర్లు, నెట్‌ బౌలర్లు, సహాయ సిబ్బందితో కలిసి మొత్తం 30 మంది వరకు ప్రయాణించొచ్చు. అధికారికంగా 15 మంది ఆటగాళ్లు, 8 మంది సహాయ సిబ్బంది ఉండాలి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి బృందంలో ఒక వైద్యుడు కచ్చితంగా ఉండాలి. వైద్య పరమైన ఇబ్బందులు, గాయాల పాలైతేనే మరో క్రికెటర్‌తో ఆ స్థానం భర్తీ చేయాలి. అలా కానప్పటికీ మార్చాలంటే ఐసీసీ ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి ఉండాలి.


మెగా టోర్నీకి టీమ్‌ఇండియా దాదాపుగా సిద్ధమైపోయిందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మధ్యే అన్నాడు. 80-90 శాతం జట్టు ఎంపికైపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. కీలకమైన జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ ఫిట్‌నెస్‌పై మాత్రమే ఆందోళన నెలకొంది. 'టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అంతకన్నా ముందు మేం ఆసియా కప్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీసులు ఆడతాం. ఇప్పటికే 80-90 శాతం మేర జట్టు కూర్పు నిశ్చయమైంది. పరిస్థితులను బట్టి మూడు, నాలుగు మార్పులుండొచ్చు. ఆసీస్‌ పరిస్థితులను బట్టి జట్టు ఎంపిక ఉంటుంది' అని హిట్‌మ్యాన్‌ తెలిపాడు.


ఇక ఆసియా కప్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు టోర్నీకి నేరుగా ఎంపికయ్యాయి. మరో జట్టును క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. తాజాగా భారత్, వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది.


ఆసియా కప్‌కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్