వేములవాడలో రెండు రోజుల క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కానిస్టేబుల్ చంద్రప్రకాష్.. వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అతని ఇంట్లో తనిఖీల్లో భాగంగా సోదాలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖకు చెందిన అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి. ఇంట్లో జరిపిన సోదాల్లో మొత్తం 41 బుల్లెట్లు లభించడం సంచలనంగా మారింది. నిజానికి అక్రమంగా ఎవరైనా సరే ఒరిజినల్ బుల్లెట్లను ఇలా చేసినట్లయితే వారిపై సీరియస్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తారు. అలాంటిది ఏకంగా గురువారం రాత్రి జరిపిన సోదాల్లో ఆయన ఇంట్లో మొత్తం 41 బుల్లెట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. వాటిలో 303 గన్‌కి చెందిన బుల్లెట్లు మొత్తం 40 వరకు ఉండగా మరోటి అత్యంత ఆధునిక నైన్ MM గన్‌కు చెందినది. అసలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు కంటే దీనిపైనే తీవ్రమైన శిక్షలతో కూడిన కేసులు నమోదయే అవకాశం ఉంది..


ఎందుకు పోలీసుల్లో టెన్షన్?
నిజానికి వేములవాడ గతంలో తీవ్రమైన నక్సలైట్ ప్రభావిత ప్రాంతం... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక పెద్ద స్థాయి ఎన్కౌంటర్లు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు నక్సలైట్ల ప్రభావం తగ్గినప్పటికీ మాజీలు, సానుభూతిపరులు పలువురు పార్టీ పట్ల కొంత సానుకూలంగానే ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా జనశక్తి పురిటిగడ్డగా ఆ పార్టీ అగ్ర స్థాయి నాయకుల స్వస్థలమే వేములవాడ. అలాంటి ప్రాంతంలో తమ డిపార్ట్మెంట్‌కి చెందిన హెడ్ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి ఇలా చేయడం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే పోలీసుల రికార్డులో బుల్లెట్ల సంఖ్య పక్కాగా ఉంటుంది. ఒకవేళ అందరు అనుమానిస్తున్నట్లుగా ఎవరైనా సంఘ విద్రోహులకు సదరు కానిస్టేబుల్ సహాయ సహకారాలు అందిస్తే.. ఏదైనా జరగరానిది జరిగితే పోలీసుశాఖకి మాయని మచ్చలా మిగిలిపోతుంది. 
ఇంతటి విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. శాఖాపరమైన చర్యలు మాత్రమే  కాదు ..చట్టపరంగా కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటే గాని కిందిస్థాయి సిబ్బంది క్రమశిక్షణలో ఉంటారని వారు భావిస్తున్నట్లు సమాచారం.


అసలు హెడ్ కానిస్టేబుల్ ఎందుకు అరెస్టు అయ్యారు?


వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయం వద్ద వేముల భరత్ అనే చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న పక్కనే ఉన్న మరో వ్యాపారికి, భరత్‌కి ఘర్షణ జరిగింది. అదేరోజు ఇరువురు ఒకరిపై ఒకరు వేములవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రెండు వర్గాల మీద పోలీసులు కేసు నమోదైంది. కాగా.. ఈ కేసులో ఒకరైన వేముల భరత్ కేసుకు ఇంఛార్జి ఆఫీసర్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ 41ఏ సీఆర్పీ కింద నోటీసులు ఇచ్చారు. స్టేషన్ బెయిల్ ఇప్పించినందుకు గానూ భరత్ వద్ద రూ.10వేలు డిమాండ్ చేశారు. కాగా భరత్ ఆరు వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. గురువారం నాడు.. పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణం వద్దకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ చంద్రప్రకాష్.. భరత్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.