Minor Suspicious Death: చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 16 ఏళ్ల బాలిక అనుమానాస్సద మృతి కేసుపై అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మీ స్పందించారు. మంగళవారం ఆమె మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. అమ్మాయి మిస్సింగ్, అనుమానాస్పద మృతి కేసులో సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. 18వ తేదీ బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు అందినట్లు చెప్పారు.
17వ తేదీ సాయంత్రం నుంచి తన కూతురు కనిపించడం లేదంటూ పెనుమూరు మండలం తానా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన బాలిక తండ్రి పెనుమూరు పోలీసు స్టేషన్‌లో ఈ నెల 18న ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తల్లిదండ్రుల ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 20వ తేదీ రాత్రి సమయంలో ఎగువచెరువు గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డి వ్యవసాయ బావిలో వినాయక నిమజ్జనం చేసేందుకు వెళ్లిన సమయంలో నీళ్లల్లో బాలిక డెడ్ బాడీ కనిపించిందన్నారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలికతో పరిచయం ఉన్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాలిక మృతదేహానికి చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు ఏఎస్పీ చెప్పారు. పోస్టుమార్టంలో మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తేలిందన్నారు. ఏదైనా అఘాయిత్యం జరిగిందో లేదో తెలుసుకోవడానికి శాంపిల్స్ ను భద్రపరిచినట్లు చెప్పారు. విష ప్రయోగం ఆనవాళ్ల ఏమైనా ఉంటే గుర్తించేందుకు నమూనాలు భద్రపరిచినట్లు చెప్పారు. మునిగి ఊపిరాడక చనిపోయిందా లేదా చనిపోయిన అనంతరం బావిలో పడేశారా అని తెలుసుకోవడం కోసం నమూనాలు సేకరించామని, వాటన్నింటి కెమికల్ అనాలిసిస్ కోసం తిరుపతి RFSL కు పంపినట్లు చెప్పారు.
రిపోర్టులు, ఫలితాలు వచ్చేలోపు అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించనున్నట్లు తెలిపారు. కాల్ డీటెయిల్స్/టెక్నికల్ అనాలసిస్, సాక్షాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. విచారణలో తెలిసిన విషయాలు, ఫోరెన్సిక్ రిపోర్టు ఫలితాలను క్రోడీకరించుకొని సమగ్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ కేసులో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు ఊహాగానాలు, నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయవద్దని సూచించారు.
కేసులో పురోగతి
ఈ కేసులో మృతురాలికి గుండు చేయించి హత్య చేసి బావిలో పడేశారని ఆరోపణలు అవాస్తవం అన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం బాలికపై ఎటువంటి అత్యాచారం జరగలేదన్నారు. శరీరంపై ఇతర గాయాలు ఏమీ లేవన్నారు. అమ్మాయికి గుండు కొట్టి చంపారనేది వాస్తవం కాదన్నారు. మృతదేహం మూడు రోజుల పాటు నీటిలో ఉండంతో పూర్తిగా డీకంపోస్ అయ్యిందని, వెంట్రుకలు ఊడిపోయాయని, అవే బావిలో దొరికాయని అన్నారు. బావిలో సుమారు 5 గంటల పాటు శ్రమించి వెంట్రుకలను కుదుళ్లతో సహా బయటపడినట్లు చెప్పారు. కేసులో నిజానిజాలు తెలుసుకొని వార్తలను పోస్ట్ చేయాలని, అసత్యాలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కుటుంబ సభ్యుల అనుమానం
అనుమానాస్పద స్ధితిలో కూతురు డెడ్ బాడీ లభించడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయకపోగా, కావాలనే కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమాస్టం రిపోర్టులో ఎటువంటి అత్యాచారం, హత్యాప్రయత్నం జరుగలేదని వైద్య నిపుణులు నివేదిక ఇచ్చినప్పటకీ, బాలిక తల్లిదండ్రులు ఆరోపణల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.