Nara Lokesh : నాలుగు దశాబ్దాలకి పైగా స్వచ్ఛ రాజకీయాలు చేసిన చంద్రబాబు ని అక్రమ అరెస్టు చేసి మాకు జగన్ గిఫ్ట్ ఇచ్చాడని, ఆరు నెలల్లో జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తానే తీసుకుంటానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతినబూనారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి 2019 నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై జరిగిన అరాచకాలు, స్కిల్ కేసులో చంద్రబాబు గారి అక్రమ అరెస్టు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో లోకేష్ మాట్లాడారు.
ఇన్నర్ రింగ్‌తో నాకేం సంబంధం : లోకేష్
రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతును జగన్ నొక్కుతున్నారని, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెట్టినా కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావడం లేదన్నారు. రోజుకో వదంతి, తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించాలని అనుమతులు కోరామని, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, వెంటనే తన పేరుని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చేర్చి గిఫ్ట్ ఇచ్చారని, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభానికి అన్ని అనుమతులకి దరఖాస్తు చేశామని, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని.. క్లియరెన్స్ వస్తే పాదయాత్ర మొదలు అవుతుందని ప్రకటించారు.
ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేయలేరా ?
తాను ఢిల్లీలో దాక్కున్నానని ఫేక్ ప్రాపగాండా చేస్తున్న వైసీపీ పెట్టించిన తప్పుడు కేసులో సత్తా ఉంటే ఢిల్లీ వచ్చి అరెస్టు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. దీంతోనే ఇది తప్పుడు కేసు అని తేలిపోయిందన్నారు. మా నాయకుడిని తప్పుడు కేసులో అరెస్టు చేసిన తరువాత న్యాయపోరాటంలో భాగంగా ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో మాట్లాడుతున్నానని వివరించారు. ఏపీలో వైకాపా అరాచక పాలనని జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లానన్నారు. భవిష్యత్తు గ్యారెంటీ,యువగళం, వారాహి యాత్రలతో తాము ప్రజల్లోకి వెళ్లకూడదనే వైసీపీ వ్యూహంలో భాగంగానే ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. తాము ఏ తప్పు చేయలేదని,న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. ప్రజల ముందు అన్ని వాస్తవాలు ఉంచామని, స్కాంలు అని ఆరోపిస్తున్న వైకాపా సర్కారు దగ్గర కనీస ఆధారాలు లేవని, చంద్రబాబుని ఆధారాలు అడుక్కుంటున్నారని ఎద్దేవ చేశారు. వైకాపా కుట్రపూరితంగా బనాయిస్తున్న ఏ ఒక్క కేసులో ఒక్క పైసా తనకు, తన కుటుంబం, తన ఫ్రెండ్స్ కి రాలేదని తేల్చి చెప్పారు.
శాంతియుతంగానే చంద్రబాబుకు మద్దతు
అక్రమ కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంఘీభావం ప్రకటిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారంతా ప్రశాంతంగా ఉన్నారని, శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ వెళ్తున్నప్పుడే ప్రభుత్వ-ప్రైవేటు ఆస్తులకి ఎటువంటి నష్టం కలగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలపాలని మాకు ఆదేశాలు ఇచ్చారని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా తమ నాయకుడు నేర్పిన క్రమశిక్షణని ఫాలో అవుతూనే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని చెప్పారు.