ప్రపంచంలో మోసం జరగని రంగం ఏదీ ఉండదు. ఎంత టెక్నాలజీ వాడినా ఎంత నిఘా పెట్టినా వాటిలో లోపాలను వెదుక్కుని మరీ మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి మోసం తమకు జరుగతోదంని అమెజాన్ సంస్థ తెలుసుకునే సరికి కోట్లకు కోట్లు మాయమైపోయాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ను అడ్డంగా మోసం చేసిన ముగ్గురు కుర్రాళ్లను నోయిదా పోలీసులు అరెస్ట్ చేశారు.  వారు ఎలా అమెజాన్‌ను మోసం చేశారో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇంత సింపుల్‌గా కోట్లకు కోట్లు కొట్టేయవచ్చా అని నోరెళ్లబెట్టారు. ముగ్గురు నిందితుల పేర్లు రాజ్‌కుమార్ సింగ్ , అరవింద్ కుమార్ , సీతారామ్ కుమార్ వీరు ముగ్గురిలో ఒకరికి 30 ఏళ్లు ఉంటే మిగతా వారికి ఇరవై మాత్రమే. 


Also Read : నెల్లూరులో వియ్యాల వారి కయ్యాలు


అమెజాన్‌లో వీరు దొంగ పేర్లతో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇలా ఒకటి కాదు.. పెద్ద ఎత్తున ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్నారు. ఆ అకౌంట్ల నుంచి అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బుక్ చేసుకుంటారు. ముందస్తుగా చెల్లింపులూ చేస్తారు. అమెజాన్ సంస్థ డెలివరీ ఇస్తుంది. అయితే ఇలా డెలివరీ తీసుకున్న కాసేపటికే పాడైపోయిన ప్రొడక్ట్ ఇచ్చారని కంప్లైంట్ పెడతారు. రిటర్న్ తీసుకోవాలని రిక్వెస్ట్ పెడతారు. ఆ తర్వాత మళ్లీ అమెజాన్ ఏజెంట్ వచ్చి దాన్ని తీసుకోవాలి.కానీ వీరు ఆ ఆమెజాన్ ఏజెంట్‌తో కుమ్మక్కయిపోయి వస్తువు రిటర్న్ ఇచ్చినట్లుగా నమోదు చేస్తారు. అలా నమోదు చేసిన వెంటనే వీరు ఆ వస్తువు కోసం కట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి. అంటే అప్పుడుతాము కట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి..  అలాగే వస్తువు కూడా ఉంటుంది. 


Also Read : తొమ్మిదో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన మహిళ.. చివరి క్షణంలో...


ఇలా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాల్ని కొనుగోలు చేసి రిటర్న్ ఇచ్చినట్లుగా నటించి... డబ్బులను వెనక్కి పొందేవారు. ఇలా దాదాపుగా రూ. రెండున్నర కోట్ల విలువైన వస్తువులు మాయమైన తరవాత అమెజాన్ సంస్థ ప్రతినిధులకు అనుమానం వచ్చింది. వస్తువులు వెనక్కి రావడం లేదు కానీ.. డబ్బులన్నీ వెనక్కి పోతున్నాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూపీ లాగిన పోలీసులకు అసలు విషయం వెల్లడయింది. ఇలా అమెజాన్ నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఢిల్లీలో తక్కువ ధరలకే అమ్మి నిందితులు సొమ్ము చేసుకునేవారు. 


Also Read : విజయనగరంలో మహిళా ఎస్ఐ ఆత్మహత్య కు కారణాలేంటి..?
  
పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం మోసం, ఫోర్జరీ మరియు నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంత కాలం ఈ కామర్స్ సంస్థలపై పలు చోట్ల ఫిర్యాదులు వచ్చేవి. తాముఫోన్ బుక్ చేస్తే సబ్బు పంపారని... రాళ్లు పంపారని..  ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రివర్స్‌లో జరిగింది. అమెజాన్‌కు కోట్లలో కన్నం పడింది. అయితే ఇలాంటి నేరాలు ఇంకా ఎక్కడైనా జరిగాయేమోనని అమెజాన్ లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత పటిష్టమైన టెక్నాలజీ వాడినా మోసగాళ్ల ముందు తేలిపోవాల్సిందేనని అమెజాన్ ఉదంతంతో స్పష్టమయింది.