నెల్లూరు ధనలక్ష్మీపురంలో వియ్యంకుల మధ్య జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కోడలు చంటి బిడ్డతో ఇంటికి రాగా.. అత్తమామలు ఆమెను తన్ని తరిమేశారు. కోడలు తరఫున మాట్లాడేందుకు వచ్చిన ఆమె బాబాయిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు.
ఇటుకలతో దాడి
భర్త చనిపోయిన తర్వాత ఆశ్రయం కోసం అత్తగారింటికి వచ్చిన కోడలిని అత్తమామలు ఇంటిలోకి రానీయకుండా తన్ని తరిమేశారు. తనని ఆదరించాలని, ఇంట్లో తనకు ఆశ్రయం కల్పించాలని ఆమె కోరింది. ఆమె తరపున ఆమె బాబాయి కుటుంబసభ్యులు మద్దతుగా వచ్చారు. కోడలికి ఆశ్రయం ఇవ్వడం ఇష్టంలేని అత్తమామలు.. ఆమెపై, ఆమెతో వచ్చినవారిపై దాడి చేశారు. ఇటుక రాళ్లతో గాయపరిచారు.
Also Read: Tollywood Drugs Case: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. ముందుగానే విచారణకు హాజరు
భర్త ఆత్మహత్య
నెల్లూరు ధనలక్ష్మీపురానికి చెందిన విజయేంద్ర రెడ్డికి, తిరుపతికి చెందిన ఊహారెడ్డికి ఏడాది క్రితం వివాహం జరిగింది. అప్పటికే విజయేంద్ర రెడ్డికి రెండు కిడ్నీలు చెడిపోయాయని, ఆ విషయం దాచి పెట్టి పెళ్లి చేశారని ఆరోపిస్తున్నారు అమ్మాయి తరపు బంధువులు. ఈ క్రమంలో విజయేంద్ర రెడ్డి మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. పక్షవాతం కూడా వచ్చింది. అనారోగ్యంతో వచ్చిన సమస్యలు తట్టుకోలేక విజయేంద్రరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ ఆత్మహత్యకు కారణం అమ్మాయి తరపు వారేనని విజయేంద్రరెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఆరు రోజుల క్రితం
కొన్ని రోజులుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. భర్త చనిపోయే సమయానికి ఊహారెడ్డి గర్భిణి. విజయేంద్రరెడ్డి చనిపోయిన ఆరు నెలలకు పండంటి పాపను జన్మనిచ్చింది. ఈ క్రమంలో పసిబిడ్డను తీసుకుని ఊహారెడ్డి అత్తగారింటికి వచ్చింది. తాను అక్కడే ఉంటానని స్పష్టంచేసింది. ఇది ఇష్టంలేని విజయేంద్రరెడ్డి తల్లిదండ్రులు ఆమెను బయటకు నెట్టేశారు. ఊహారెడ్డి బాబాయిపై దాడి చేశారు. ఆరు రోజుల క్రితం జరిగిన ఈ కొట్లాట దృశ్యాలు వైరల్‌గా మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.