భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోడు భూముల వివాదం నేపథ్యంలో వలస గొత్తికోయలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్‌ మొక్కలను గుత్తికోయలు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహం చెందారు.


వారు సహనం  కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఫారెస్ట్‌ అధికారులు చేసిన దాడిలో గిరిజనులకు గాయాలైనప్పటికీ తొలిసారిగా గుత్తికోయలు దాడి చేయడం, ఈ దాడిలో రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. గుత్తికోయలు చేసిన దాడిపై అప్రమత్తమైన పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.


20 ఏళ్లుగా పోడు వివాదం..


చండ్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో వలస గుత్తికోయల పోడు వివాదం 20 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక మార్లు పోడు భూములకు ట్రెంచ్‌లు కొట్టి వాటిని కాపాడేందుకు పారెస్ట్‌ అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే 20 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు దక్కవనే భావనతో ఇక్కడ గుత్తికోయలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల క్రితం సైతం పోడు భూముల వివాదంలో ఫారెస్ట్‌ అదికారులు దాడులు చేశారు. 


కాగా తాజాగా అటవీ శాఖ అధికారులు పెంచుతున్న మొక్కలనే ఏకంగా నరికివేసేందుకు వెళ్లిన గుత్తికోయలు దానిని అడ్డుకునేందుకు వచ్చిన అధికారులు, పారెస్ట్‌ సిబ్బందిపై దాడులు చేయడం గమనార్హం. వేట కొడవళ్లతో దాడులకు పాల్పడటంతో ఇప్పుడు ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని అత్యధిక పోడు భూముల వివాదం ఉన్న కొత్తగూడెంలో ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది.


పోడు వ్యవసాయం అంటే..


అడవుల్లోనూ, కొండ వాలుల్లోనూ చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయమని పిలుస్తారు. గిరిజనులకు అదే జీవనాధారం. సాంప్రదాయ బద్దంగా చేసుకునే ఇలాంటి వ్యవసాయంపై తెలంగాణ రాష్ట్రంలో చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తరతరాలుగా గిరిజనులు పోడు వ్యవసాయం పరిమితంగానే చేసుకుంటూ వస్తున్నారు. కానీ అటవీ సంపద, విస్తీర్ణం తగ్గే కొద్ది ప్రభుత్వం పోడు వ్యవసాయంపై ఫోకస్ పెట్టింది. గిరిజనులు అటవీ చట్టాలను ఉల్లంఘించి వ్యవసాయం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో అటవీ అధికారులు వారికి అడ్డుతగులుతూ వస్తున్నారు. దీంతో పోడు భూములు సాగు చేసుకునేవారికి, అటవీ అధికారులకు మధ్య తరచూ ఏదో వివాదం జరుగుతూనే ఉంది.