Singer Mangli SVBC:  ప్రముఖ సినీ గాయని సత్యవతికి తిరుమల తిరుపతి దేవస్థానం .. ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమించింది. మంగ్లీ పేరుతో ఆమె బాగా పాపులయ్యారు. తెలంగాణ యాసలో ఆమె పాడిన పాటలు పాపులర్ అయ్యాయి.  బతుకమ్మ పాటలతో పాటు పలు సినిమాల్లో ఆమె పాటలు ప్రజాదరణ పొందాయి. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ  ప్రచార పాటలు పాడారు. జగనన్న పేరుతో ఆమె పాడిన పాటలు పాపులర్ అయ్యాయి. అలాగే జగన్ ప్రచార సభల్లోనూ .. ఆయన రాక ముందు నిర్వహించే సాంస్కృతి క కార్యక్రమాల్లో ఖచ్చితంగా మంగ్లి ప్రదర్శ ఇచ్చే వారు. ఎస్వీబీసీకి సలహాదారుగా నియమిస్తూ  జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.


మార్చి 29నే నియమించినట్లుగా ఉత్తర్వుల్లో వెల్లడి 
  
మార్చి 29వ తేదీన సత్యవతి అలియాస్ మంగ్లిని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే అప్పట్లో ఆమె బాధ్యతలు తీసుకున్నారో లేదో స్పష్టత లేదు. నాలుగు రోజుల కిందటే  ఆమె బాధ్యతలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే తాజాగా ఆమె నియామక ఉత్తర్వుల జీవోను వెలుగులోకి తెచ్చినట్లుగా భావిస్తున్నారు. సలహాదారు పదవి వల్ల ప్రతి నెలా ఆమెకు రూ. లక్ష చెల్లించనున్నారు. అలా  మంగ్లీ తిరుపతికి వచ్చినప్పుడల్లా.. వాహన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే ప్రయారిటీ  బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఆమె సేవలను అవసరమైనప్పుడు  ఎస్వీబీసీ సీఈవో వినియోగించుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయని.. టీటీడీ, ఎస్వీబీసీ 


ఈ నియామకాన్ని అటు టీటీడీ కానీ.. ఇటు ఎస్వీబీసీ కానీ అధికారికంగా ప్రకటించలేదు.  జీవో మాత్రం వెలుగులోకి వచ్చింది. అలాగే సింగర్  మంగ్లీ కూడా దీనిపై స్పందించలేదు.   నవంబర్ 17న ఆమె తిరుమలకు వచ్చి.. రెండ్రోజులు అక్కడే ఉండి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే ఆమె బాధ్యతలు స్వీకరించారన్న సమాచారం మాత్రం బయటకు వస్తోంది.  మార్చిలో  జీవో ఇస్తే ఇప్పటి వరకూ మంగ్లి ఎందుకు బాధ్యతలు తీసుకోలేదన్న సందేహం అనేక మందిలో వస్తోంది. రెండేళ్ల పాటు పదవి కాలం ఉండేలా ఈ సలహాదారు పదవి ఇచ్చారు. రెండేళ్లు అంటే.. జీవో విడుదల చేసినప్పటి నుంచా.. లేకపోతే బాధ్యతలు తీసుకున్నప్పటి నుండా అన్నది కూడా సందేహంగానే మారింది. 


నెలకు రూ. లక్ష వేతనం..  తిరుపతి వచ్చినప్పుడల్లా వాహనం, వసతి 


ఏపీ ప్రభుత్వం ఎంతో మంది సలహాదారుల్ని నియమిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు టీటీడీకి .. అనుబంధ సంస్థలకు  కూడా సలహాదారులను నియమించడం అనూహ్యంగా మారింది. సింగర్ మంగ్లి నియామకం వివాదాస్పదం అవుతుందని అనుకున్నారేమో కానీ గోప్యంగా ఉంచారని భావిస్తున్నారు. గతంలో ఎస్వీబీసీ చైర్మన్‌గా ఫృధ్వీని నియమించారు. వివాదాల కారణంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.  తర్వాత చైర్మన్‌గా మరొకరిని నియమించారు. 


శరత్ చంద్రారెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి - టీడీపీ నేత అనూహ్యమైన డిమాండ్ !