Anam TDP : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే దావోస్ వెళ్లారని .. అంత అవసరం ఏమిటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. దావోస్ వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ కాదా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నల్లధనం, బంగారం తరలించేందుకే బేగంపేట నుంచి వెళ్లారని ఆరోపించారు. జగన్ దావోస్ పర్యటనలో మూడు రోజులు మాయమయ్యారని.. ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అరబిందో వాళ్లని జగ్గూభాయ్ కలిశారా? లేదా? అని ప్రశ్నించారు. జగ్గూభాయ్ మాఫియాతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయన్నారు.
శరత్ చంద్రారెడ్డికి ముప్పు - జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలన్న ఆనం
ఈడీ విచారణలో రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని, ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎందుకు కలిశారో చెప్పాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. బాబాయ్‌ని చంపిన గొడ్డలికి ఇంకా రక్తం మరకలు ఆరలేదని బెదిరించడానికా .. అమిత్ షా కాళ్లుపట్టుకుని అయినా కాపాడతాడని చెప్పడానికా? అని మండిపడ్డారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డితో, ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఈడీ, సీబీఐ అధికారులు ఎలా కలవనిస్తారని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకి మాఫియా వల్ల ప్రాణహాని ఉందని, ఈడీ, సీబీఐ అధికారులు వెంటనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. మద్యం గురించి అడిగితే, హెరిటేజ్ పాల గురించి మాట్లాడతారని.. మద్యానికి, పాలకి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. అదానీ డిస్టలరీస్ నుంచి రూ.వందకోట్లు చేబదులు ఎందుకు తీసుకున్నారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి ఎలా కలిశారు ? ఎందుకు కలిశారు ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డిని రౌజ్ అవెన్యూ కోర్టులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలుసుకున్నారు. రిమాండ్ విధించిన తర్వాత శరత్ రెడ్డిని జైలుకు తరలించడానికి దాదాపు గంటకుపైగా సమయం పట్టింది. ఆ క్రమంలో చెవిరెడ్డి కోర్టుకు వచ్చారు. శరత్ రెడ్డిని జైలుకు తరలించడానికి కోర్టు హాలు నుంచి పోలీసు కారులో ఎక్కించే వరకు వారిద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. వాస్తవంగా అయితే.. కుటుంబసభ్యులు మాత్రమే కలవడానికి పర్మిషన్ ఉంటుంది. కానీ చెవిరెడ్డి మాత్రం దర్జాగా కలిశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏం మాట్లాడుకున్నారని ఆనం ప్రశ్నిస్తున్నారు.
తీహార్ జైలుకు శరత్ రెడ్డి తరలింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డిని తీహార్ జైలుకు తరలించారు. ఈ కేసులో వారిద్దరికీ ప్రమేయం ఉందంటూ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొన్ని రోజులపాటు విచారించింది. ఈ నెల 10న ఇద్దరినీ ఈడీ అరెస్ట్ చేసింది. న సంగతి తెలిసిందే. తొలుత ఏడు రోజులు, తర్వాత మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. కస్టడీ గడువు ముగియడంతో సోమవారం రౌజ్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట వారిద్దరినీ ఈడీ అధికారులు హాజరుపరిచారు. వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తదుపరి విచారణను డిసెంబరు 5కు వాయిదావేశారు.