రోజ్ గార్ మేళా‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన మరో 71 వేల మందికి మంగళవారం (నవంబరు 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందించారు. ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. నియామక పత్రాలను ఎన్నికల నియమావళి అమలులో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ నహా మిగిలిన రాష్ట్రాల్లోని 45 ప్రాంతాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 22న 75వేల మందికి నియామకపత్రాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడత నియామక పత్రాలు అందజేశారు.


ఈ సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగు కోసం 'కర్మయోగీ భారత్' పేరిట టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన పలు ఆన్‌లైన్ కోర్సులను అందించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను మరింత మెరుగ్గా చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు.








దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇదే అంశంపై జూన్‌లోనే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరులను సమీక్షించారు. కొన్ని నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్లాన్‌తో ముందుకు కదులుతున్నారు. దీనితో పాటు వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం మిషన్‌ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు.


గతేడాది, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మార్చి 1, 2020 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖలలో 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. వారిని రిక్రూట్ చేయడానికి పీఎం మోదీ ఈ చొరవ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో మొత్తం 40 లక్షల 4 వేల పోస్టులు ఉన్నాయని, వాటిలో దాదాపు 31 లక్షల 32 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నారని జితేంద్ర సింగ్ చెప్పారు. అంటే 8.72 లక్షల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...