మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం తెలుసు కదా. అలానే భూ అస్తమయం ఎప్పుడైనా ఎక్స్ పీరియన్స్ చేశారా. భూమి అస్తమించటం ఏంటీ.. అదేమన్నా సూర్యుడా అంటే కాదు కానీ.. నాసా ఓరియన్ భూ అస్తమయాన్ని క్యాప్చర్ చేసింది. నాసా ఆర్టెమిస్ ప్రయోగం ద్వారా ఓరియన్ క్యాప్స్యూల్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుని అక్కడే చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. అలా చంద్రుడిని క్యాప్చర్ చేస్తున్న టైంలో భూమి అస్తమిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలను క్యాప్చర్ చేసింది ఓరియన్.
ఇక్కడే మనం ఉదయం, అస్తమించటం ఏంటీ అసలు అనేది ఓ సారి చూద్దాం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమి పై మనమున్న చోట పడటం మొదలైనప్పుడు సూర్యోదయం అయినట్లు అనిపిస్తుంది. సూర్యుడి కాంతి భూమిపై మనమున్న చోటు నుంచి పూర్తిగా మాయమైపోతునప్పుడు సూర్యాస్తమయం అయినట్లు భావిస్తాం. వాస్తవానికి ఇదంతా ఇల్యూషనే. సూర్యుడు అక్కడే ఉంటాడు. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండటం వలన మనకు సన్ రైజ్, సన్ సెట్ అవుతున్నట్లు అనిపించింది. అలానే ఇప్పుడు చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసా ఓరియన్ క్యాప్సూల్ కు భూమి కనిపించటం, కనిపించకపోవటం జరుగుతుంది. అలా కనిపించకుండా మాయమైపోతున్నప్పుడు తీసిందే ఎర్త్ సెట్...భూ అస్తమయం అన్నమాట. ఇదే కాకుండా భూమి నుంచి 3లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ నుంచి ఓరియన్ క్యాప్యూల్ తీసిన ఫోటోను కూడా నాసా షేర్ చేసింది. పేల్ బ్లూ డాట్ లా భలే ఉంది కదా.
నవంబర్ 16న SLS రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశించింది Nasa Artemis. బూస్టర్ నుంచి వేరైన ఓరియన్ క్యాప్య్సూల్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి దాని చుట్టూ తిరుగుతోంది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు పరిశోధనలు చేసేందుకు వీలుగా అక్కడ పరిస్థితులను పరిశీలించటం సహా అనేక పనులు చేయనుంది ఓరియన్ క్యాప్య్సూల్. అందులో భాగంగా సెల్ఫీలు తీసుకోవటం దగ్గర నుంచి భూమి ని మూడు లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఫోటోలు తీయటం, భూమి చంద్రుడి మాటుకు వెళ్తున్నప్పుడు ఫోటోలు తీయటం ఇలా ఇప్పటి వరకూ అపోలో మిషన్ చేయని పనులను కూడా ఆర్టెమిస్ ఓరియన్ క్యాప్య్సూల్ చేస్తోంది.
ఇప్పుడు చేపట్టిన ఆర్టెమిస్ 1 సక్సెస్ రాబోయే అర్టెమిస్ 2, ఆర్టెమిస్ 3 ప్రయోగాల ద్వారా మానవులు చంద్రుడి మీద స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేలా ప్రయోగాలు చేయాలనేది నాసా ఆలోచన. అంతే కాదు 2025 నాటికి చంద్రుడి మీదకు తొలి మహిళను, తొలి నల్లజాతి వ్యక్తిని పంపించాలని ప్లాన్ చేస్తోంది నాసా.