Bengaluru Crime News: కొన్ని కొన్ని ఘటనలు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. ఓ మహిళ ఓ భారీ సూట్ కేసులో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చింది. చూడటానికి బాగా చదువుకున్న ట్లుగా ఉంది. దీంతో పోలీసులు అనుమానించలేదు. బ్యాగులో లగేజీ ఉందేమో అనుకున్నారు. ఏదో సమస్యతో వచ్చిందేమో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.కానీ ఆమె చెప్పింది విని పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. తమ కెరీర్‌లో చాలా నేరాలు చూసి ఉంటారు కానీ.. ఆ యువతి చెప్పింది విని మాత్రం .. ఉలిక్కి పడక తప్పలేదు.                      


ఆ యువతి తెచ్చిన సూట్ కేసులో శవం ఉంది. అది కూడా ఆ యువతి తల్లిదే. ఎవరు చంపారంటే.. ఆ యువతే. అక్కడే అసలు ట్విస్ట్ అదే.  పశ్చిమ బెంగాల్ కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తోంది.  మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. ఆమెతో పాటు తల్లి కూడా ఉంటోంది. అయితే ఇద్దరి మధ్య సఖ్యత లేదు. రోజూ గొడవపడేవారు. దీంతో కూతురు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.  ఫిజియోథెరపిస్ట్ తన తల్లిని హతమార్చింది. అనంతరం తల్లి శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. తల్లిని హత్య చేశానని చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయింది.                                                    


మొదట ఆ మహిళ తన తల్లి నిద్ర మాత్రలు మింగిందని చెప్పి పోలీసుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అలా అయితే ఆస్పత్రికి తీసుకెళ్లాలి కానీ ఇలా సూట్ కేసులో పెట్టి పోలీసు స్టేషన్ కు తీసుకు రావడం ఏమిటని పోలీసులు తమదైన  శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయట పెట్టినట్లుగా చెబుతున్నారు.  దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అసలేం జరిగిందో ఆరా తీయడం ప్రారంభించారు. 


ఇటీవలి కాలంలో సమాజంలో అత్యంత ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. మనుషుల్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను ఇంట్లోనే దాచి పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. ఆ క్రమంలో.. ఇప్పుడు తల్లినే హతమార్చి పోలీస్ స్టేషన్ కు సూట్ కేసులో డెడ్ బాడీ పెట్టుకుని రావడం సంచలనంగా మారింది  .