విజయ్ వర్మతో ప్రేమ గురించి నోరు విప్పిన తమన్నా!


హైదరాబాదీ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం గురించి ఎట్టకేలకు మౌనం వీడింది మిల్కీ బ్యూటీ తమన్నా. తనతో ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చింది. “చాలా మంది అమ్మాయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని భావిస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. అలాగే విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుంది. ఇద్దరి మధ్యనున్న బంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను” అని తమన్నా వెల్లడించింది.    


వాస్తవానికి గత కొంతకాలంగా తమన్నా, హైదరాబాదీ హీరో విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని వాళ్లిద్దరూ ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తొలుత గుట్టుగా ఉంచారు. కానీ, ఇప్పుడు తమ ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. విజయ్ వర్మది హైదరాబాద్ అయినప్పటికీ.. ఆయన ముంబైలోనే ఉంటున్నారు. అటు తమన్నా పంజాబీ అమ్మాయి అయినా సరే... పుట్టిందీ, పెరిగిందీ, అంతా ముంబైలోనే. ఇద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో మునిగితేలుతున్నారు. పలుమార్లు పార్టీలకు, పబ్బులకు వెళ్తూ మీడియాకు కనిపించారు.   


అసలు ప్రేమ విషయం ఎప్పుడు బయటకు వచ్చిందంటే?


2023 న్యూ ఇయర్ వేడుకలకు తమన్నా, విజయ్ వర్మ గోవా వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నారు. కొత్త ఏడాదికి అందరూ వెల్కమ్ చెప్పారు. తమన్నా, విజయ్ వర్మ కూడా చెప్పారు. అయితే, వీరిద్దరు లిప్ కిస్ పెట్టుకునే రొమాంటిక్ వీడియో లీక్ కావడంతో అసలు విషయం బయటపడింది. హిందీలో 'లస్ట్ స్టోరీస్' సీజన్ 2 షూటింగులో వీళ్ళిద్దరికీ పరిచయం అయ్యిందని, ప్రేమలో పడ్డారని సినిమా జనాలకు, సగటు ప్రేక్షకులకు తెలిసింది. ఇక బాలీవుడ్ సినిమా 'పింక్'తో విజయ్ వర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


 రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన 'గల్లీ బాయ్‌'లోనూ ఆయనకు మంచి క్యారెక్టర్ దక్కింది. అందులో నటనకు పేరు వచ్చింది. ఆలియా భట్‌, విజయ్ వర్మ నటించిన నెట్‌ ఫ్లిక్స్‌ సినిమా 'డార్లింగ్స్‌' కూడా హిట్టే. అందులో శాడిస్ట్‌ ప్రేమికుడు, భర్తగా విజయ్‌ వర్మ నటన జనాలను ఆకట్టుకుంది. తెలుగులో నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో విలన్ రోల్ చేశారు విజయ్ వర్మ. విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే విషయం బయటకు రావడానికి ముందు ఎవరూ ఊహించలేదు. ముంబైకి చెందిన ఎవరో వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో పడ్డారని పుకార్లు షికార్లు చేశాయి. పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా రెడీ అయ్యారని రూమర్స్ వచ్చాయి. వాటిని తమన్నా ఖండించింది.   
  
తమన్నా, విజయ్ కలిసి 'లస్ట్ స్టోరీస్ 2'లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. అటు తమన్నా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' చేస్తున్నారు. అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న సినిమా 'భోళా శంకర్'. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు.


Read Also: మరో మెగా హీరో సినిమాలో 'ఏజెంట్' భామ సాక్షి వైద్య