Suryalanka Beach : బాపట్ల జిల్లా  సూర్యలంక సముద్రతీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన ఏడుగురు యువకులు విహారయాత్రకు బాపట్ల సూర్యలంక  బీచ్ కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి యువకులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దదిని గజ ఈతగాళ్లు రక్షించారు. మూడు మృతదేహాలను వెలికితీశారు.  మరో ఇద్దరి కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు.  మృతులు విజయవాడకు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



చిలకలూరిపేటలో విషాదం 


గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని ఓగేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.  చిలకలూరిపేట పట్టణంలోని బొబ్బాల సత్యనారాయణ వీధికి చెందిన రమేష్ , స్రవంతిల కుమారుడు నూతలపాటి కార్తీక్ (14),  దాసరి బజారుకు చెందిన బాజిబాబు కుమారుడు పి. మోహనసాయి అనీష్(13)లు స్నేహితులు. నూతలపాటి కార్తీక్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మోహన సాయి అనీష్(13)  మరో ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి  చదువుతున్నారు. వీరు సోమవారం క్రికెట్ ఆడుకోడానికి బయటకువెళ్లారు. అనంతరం అక్కడకు సమీపంలోని ఓగేరువాగులో ఈతకు దిగారు. పట్టుతప్పి వాగులో కొట్టుకుపోతుండగా విద్యార్థుల కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని వాగులో నుంచి వారిని బయటకు తీసుకువచ్చారు. వారిద్దరనీ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 


 కోతులు వెంటబడడంతో 


నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడి పల్లిలో నలుగురు చిన్నారుల విషాదం తీవ్రoగా కలిచివేసింది. గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా ఆడుకుంటుండగా కోతులు రావటంతో చిన్నారులు భయపడ్డారు.  కోతుల భయంతో నలుగురు పరుగులు తీశారు. ఊరు చివరన ఉన్న చెరువులో నలుగురు చిన్నారులు దుకేశారు. నలుగురిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరిని కాపాడారు. మరో ఇద్దరిని కాపాడే సమయానికి అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.


Also Read : Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు


Also Read : Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం