FIR On Srikalahasti CI : హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనలో తక్షణం సీఐ అంజూయాదవ్‌పై కేసు పెట్టి .. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశిస్తూ లేఖ పంపింది. మహిళపై అంజూయాదవ్ దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేత వంగలపూడి అనిత ట్విట్టర్‌లో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మకు ఫిర్యాదు చేశారు. వీడియోలు, బాధితురాలి వాంగ్మూలాన్ని చూసిన రేఖా శర్మ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.
మహిళపై దాడి చేసిన తర్వాత సీఐ గతంలో వ్యవహరించిన విధానం కూడా సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది. తోటి పోలీసుల్ని కూడా ఆమె అసభ్యంగా తిడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో బాధితురాలిపైనే రివర్స్‌లో అక్రమ మద్యం కేసు నమోదు చేశారు. కానీ సీఐ అంజూయాదవ్‌పై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీడబ్ల్యూ ఆదేశాల మేరకు పోలీసులు సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది.
బాధిత మహిళ శ్రీకాళహస్తిలో ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్ ఆమె భర్త ఆచూకీ అడిగారు. అయితే మహిళ తెలియదని చెప్పడంతో ఆమెపై సీఐ అంజూ యాదవ్ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమె చీర ఊడిపోతున్న సీఐ స్పందించలేదు. మహిళను బలవంతంగా జీప్ ఎక్కించి రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అకారణంగా సీఐ తనపై దాడి చేశారని బాధిత మహిళ అంటున్నారు. తన కుమారుడు వేడుకున్నా సీఐ పట్టించుకోకుండా దాడి చేశారని బాధితురాలు ఆవేదన చెందారు. సీఐ కొంతకాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తోందని బాధిత మహిళ ఆరోపించారు.
ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తరచూ విమర్శలు వస్తున్నాయి. కొంత మంది పట్టపగలు హత్యాయత్నాలు చేసినా వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేలా చేస్తున్నారని కానీ కొంత మందిపై తప్పుడు కేసులు పెట్టి అర్థరాత్రుళ్లు కూడా అరెస్ట్ చేసి కొడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుల్లో మహిళలు కూడా ఉంటూండటంతో . ఏపీలో ఎవరికీ రక్షణ లేదని వారు మండి పడుతున్నారు. ఈ కేసులో పోలీసులు అంజూయాదవ్‌పై చర్యలు తీసుకుంటారా లేదా అన్నదానిపై ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు జాగ్రత్తగా ఉంటారా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.