అనంతపురం జిల్లాలో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం అర్ధరాత్రి వివాహ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుండగా బొలెరో వాహనం రూపంలో మృత్యువు దూసుకోచింది. ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం (నవంబరు 11) అర్ధరాత్రి పెళ్లి ఊరేగింపు రోడ్డు దాటుతుండగా కళ్యాణ్ దుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఒకసారిగా వారి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి బృందంపై దూసుకు వచ్చిన బొలెరో వాహనం కొద్దిగా ముందుకు వెళ్లి మరో కారును ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న రామప్ప, అనిల్, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తి బోనేంద్రతో పాటు ఓ మృతుడు సూరప్ప భార్య లక్ష్మీదేవికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం అనంతరం గ్రామస్తులు బంధువులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయమని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని అన్నారు. ప్రమాదానికి అవకాశం లేకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. మరోవైపు ఇదే విషయంపై పోలీసులు అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు వచ్చి సరైన సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల వివరాలు..
1) షఫీ (33), మైలారం పల్లి గ్రామం ఉరవకొండ మండలం, ఇతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
2) సూరప్ప (55), పంపనూరు గ్రామం
క్షతగాత్రుల వివరాలు రామప్ప, అనిల్, బోనేంద్ర
వీరు పంపనూరు గ్రామంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అదే సమయంలో అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళుతున్న బొలెరో వాహనం ఒకరిని ఢీకొంది. అనంతరం మరో 50 మీటర్ల ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సూరప్పను కూడా ఢీకొంది. దీంతో ఘటనా స్థలంలోనే మీరు మృతి చెందారు. వీరితోపాటు ముందు వెళ్తున్న మరో టాటా ఇండికా కారును ఢీకొనగా ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది అందులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అవ్వడంతో వీరిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.