Diwali 2023 Special Sweet : దీపావళి (Deepavali 2023) పూజసమయంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేందుకు మీరు కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే.. కొబ్బరి పాయసం మీకు బెస్ట్ ఆప్షన్. ఇది మీకు మంచి రుచిని అందిచడమే కాకుండా.. మీరు చాలా తేలిగ్గా తయారు చేసుకోగలిగే రెసిపీ ఇక్కడ ఉంది. ఇది కేవలం పూజలకే కాదు.. దీపావళి అంటేనే స్వీట్స్. మరి ఇంట్లోనే కమ్మని పాయసం (Coconut Payasam) చేసుకుంటే అంతకన్నా ఏమి కావాలి చెప్పండి. 


పైగా కొబ్బరి మంచి పోషకాలకు నిలయం. అంతేకాకుండా ఈ స్వీట్​లో చక్కెరకు బదులుగా బెల్లం వేస్తాము. కాబట్టి మీరు ఫిట్​నెస్​కి ప్రాధాన్యతనిచ్చేవారైనా సరే.. ఈ చక్కని, కమ్మని కొబ్బరి పాయాసాన్ని ఆస్వాదించేయవచ్చు. కాబట్టి హాయిగా ఈ రెసిపీని మీరు తయారు చేసి.. కుటుంబంతో, బంధువులతో హాయిగా లాగించేయండి. మరి ఈ సింపుల్, టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


కొబ్బరి - 1 కప్పు


కొబ్బరి నీళ్లు - అరకప్పు


పాలు - అరలీటరు


కొబ్బరి పాలు - అరలీటరు


సగ్గుబియ్యం - 1 కప్పు (అరగంట ముందు నానబెట్టుకోవాలి)


బెల్లం - ఒకటిన్నర కప్పు


యాలకుల పొడి - చిటికెడు


గార్నిష్ కోసం..


నెయ్యి - 2 టీస్పూన్లు


జీడిపప్పు - 10


బాదం - 5


పిస్తా -5


కుంకుమ పువ్వు - చిటికెడు


తయారీ విధానం


ముందుగా మిక్సర్​ తీసుకుని దానిలో కొబ్బరి నీరు వేయండి. దానిలో తరిగిన కొబ్బరి వేయండి. అది బాగా బ్లెండ్, మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేయండి. తర్వాత వెడల్పాటి కడాయి తీసుకుని దానిలో పాలు పోయండి. దానిని బాగా మరిగించి.. దగ్గరగా అయ్యేవరకు ఉడికించండి. పాలు సగమయ్యాక.. దానిలో ముందుగా తయారు చేసిపెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. దానితో పాటు మీరు కొబ్బరి పాలు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగిస్తుండగా దానిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. 


ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి దానిపై మరో కడాయి తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పుల బెల్లం వేసి.. దానిలో కొద్దిగా నీళ్లు వేయండి. బెల్లం కరిగేవరకు దానిని బాగా తిప్పండి. ఇప్పుడు మరుగుతున్న కొబ్బరి మిశ్రమంలో ఈ బెల్లం వేసి బాగా కలపండి. బెల్లం వేసి కలిపే సమయంలో స్టవ్ ఆపేయండి. లేదంటే పాలు విరిగిపోతాయి. మీరు బెల్లం మిశ్రమం వేసి బాగా కలిసింది అనుకున్న తర్వాత.. స్టౌవ్ వెలిగించండి. అది చిక్కబడే వరకు ఉడికించండి. ఇప్పుడు చిన్న కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి.. జీడపప్పు, నట్స్ వేసి దోరగా వేయించండి. వీటిని పాయసంలో వేసి.. యాలకులపొడి, ఉంటే కుంకుమపువ్వు వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయండి. అంతే వేడి వేడి కొబ్బరి పాయసం రెడీ. దీనిని మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టి.. మీరు తినేందుకు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే చల్లగా తిన్నా కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. 


Also Read : హెల్తీ దీపావళి కోసం స్పెషల్ డైట్.. డ్రింక్.. డిటాక్స్ టిప్స్