US Teen Murders: 


టెక్సాస్‌లో దారుణం..


అమెరికాలోని టెక్సాస్‌లో 18 ఏళ్ల కుర్రాడు సొంత కుటుంబ సభ్యుల్నే కాల్చి చంపేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే "వాళ్లందరూ నన్ను తినేస్తారేమో అని భయం వేసింది. అందుకే చంపేశాను" అని సమాధానం చెప్పాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. నిందితుడు సిజర్ ఒలాల్డ్‌ని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు,ఇద్దరు తోబుట్టువులనూ చంపేశాడు. వారిలో ఓ 5 ఏళ్ల చిన్నారి ఉన్నాడు. గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపించడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి వద్దకు చేరుకునే లోపే...నిందితుడు లోపల ఉన్నాడు. ఇంట్లోని మిగతా వాళ్లు శవాలై పడి ఉన్నారు. తన వద్ద తుపాకీ ఉందని, జస్ట్ ట్రిగ్గర్ చేసి అందరినీ కాల్చి పారేశానని చాలా సింపుల్‌గా సమాధానం చెబుతున్నాడు ఆ కుర్రాడు. చంపినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం కూడా అతనిలో కనిపించకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాత్‌రూమ్‌లో ఇద్దరి మృతదేహాలను కనుగొన్న పోలీసులు...వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. 


"ఇంట్లో వాళ్లను పరుగులు పెట్టించి మరీ కాల్చి ఉంటాడని భావిస్తున్నాం. వారంతా చనిపోయారని నిర్ధరించుకున్నాక బాత్‌రూమ్‌లో పడేశాడు. ఇల్లంతా రక్తంతో తడిసిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ మహిళ లోపలకు వెళ్లి అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ...ఆమెనీ చంపేస్తానని గన్ చూపించాడు. భయంతో ఆమె వెనక్కి వచ్చేసింది. ఇరుగు పొరుగు వాళ్లతో ఈ కుటుంబానికి ఎలాంటి గొడవలూ లేవు. అందరితోనూ సరదాగా మాట్లాడతారు"


- పోలీసులు


వరుస ఘటనలు..


అమెరికాలో ఇటీవలే విచ్చలవిడి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎంతో మంది చనిపోయారు. ఓ దుండగుడు తుపాకీతో షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించి ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన టెక్సాస్ ప్రావిన్స్‌లోని అలెన్‌లో ఉన్న మాల్‌కు సంబంధించినది. ఆదివారం, మే 7 పట్టపగలు ఓ యూనిఫాంలో ఉన్న యువకుడు రైఫిల్‌తో మాల్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై వేగంగా కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో చాలా మంది అక్కడికక్కడే మృతి చెందగా, నేల అంతా రక్తసిక్తం అయిందని స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి. కాల్పుల మోతతో మాల్ కాంప్లెక్స్ మారుమోగింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. కొంతసేపటికి అక్కడ విపరీతమైన కేకలు వినిపించాయి. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. దాడి చేసిన వ్యక్తి హతమైనట్లు పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. అయితే, దాడి చేసిన వ్యక్తి కాల్పులు జరిపిన తర్వాత తనను తాను కాల్చుకున్నాడా లేదా పోలీసుల ప్రతీకార కాల్పుల్లో మరణించాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. 


అంతకు ముందు అదే టెక్సాస్‌లో  క్లీవ్‌లాండ్‌లో ఓ ఇంట్లో దాక్కున్న నిందితుడు ఉన్నట్టుండి బయటకు వచ్చి గన్‌ ఫైరింగ్ మొదలు పెట్టాడు. పక్కింటి వాళ్లు ఈ ఫైరింగ్‌ సౌండ్ విని భయపడిపోయారు. వెంటనే బయటకు వచ్చి ఫైరింగ్ ఆపాలని చెప్పారు. ఇంట్లో చిన్నపాప నిద్రపోతోందని, భయపడుతోందని వార్నింగ్ ఇచ్చారు. కానీ....ఆ నిందితుడు అందుకు ఒప్పుకోలేదు. పైగా నా ఇంట్లోకి ఎందుకొచ్చావ్ అంటూ బెదిరించాడు. ఆ తరవాత ఉన్నట్టుండి వాళ్లపై కాల్పులు జరిపాడు.  AR-15 గన్‌తో ఫైరింగ్ మొదలు పెట్టాడు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 8 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.


Also Read: Cyber Fraud: వన్ ప్లస్ వన్ ఆఫర్‌ చూసి టెంప్ట్ అయిన మహిళ, లింక్ క్లిక్ చేయగానే రూ.90 వేలు హాంఫట్