RSS Ban: 


బ్యాన్ వివాదం..


బజ్‌రంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాన్‌ (Bajrang Dal Ban) వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చినప్పుడు మొదలైన ఈ రగడ..ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా...మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇదే విషయమై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ నళిన్ కుమార్ కటీల్‌ స్పందించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడితే RSSని బ్యాన్ చేస్తామని మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. అదే జరిగితే కాంగ్రెస్‌ని బూడిద చేసేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. 


"RSS బ్యాన్‌పై ప్రియాంక్ ఖర్గే ఏవేవో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త. ఇప్పుడు ఆయన దేశాన్నే ఏలే పదవిలో ఉన్నారు. మేమంతా ఆ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన వాళ్లమే. అప్పట్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నర్సింహరావు ప్రభుత్వాలు RSSని బ్యాన్ చేయాలని చూశాయి. కానీ...అది వాళ్ల వల్ల కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ అదే ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ని కాల్చి బూడిద చేస్తాం. ప్రియాంక్ ఖర్గే ఈ దేశ చరిత్ర ఏంటో తెలుసుకుంటే మంచిది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి"


- నళిన్ కుమార్, కర్ణాటక బీజేపీ చీఫ్ 


నిజంగానే కర్ణాటక ప్రభుత్వం బజ్‌రంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తుందా...అన్న డిబేట్ మొదలైంది. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే క్లారిటీ ఇచ్చారు. సమాజంలో విద్వేషాలు, అశాంతికి కారణమయ్యేది ఎవరైనా సరే..సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అది PFI అయినా, బజ్‌రంగ్ దళ్ అయినా...అవే చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇదే సమయంలో హిజాబ్‌ వివాదంపైనా స్పందించారు. 


"కర్ణాటకలో అనవసరపు అల్లర్లు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. అది PFI కానివ్వండి, బజ్‌రంగ్‌ దళ్, RSS..ఇలా ఏ సంస్థైనా సరే. అలాంటి వాటిని సహించేదే లేదు. చట్టపరంగా, రాజ్యాంగ పరంగా కచ్చితంగా చర్యలు తప్పవు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఆ సంస్థల్ని నిషేధించడానికి కూడా వెనకాడం"


- ప్రియాంక్ ఖర్గే, కర్ణాటక మంత్రి