తెలుగు సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఓ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సినీరంగంలో కానీ రాజకీయరంగంలో కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ సేవలను కొనియాడుతున్నారంటే ఆయన సేవలు అప్పట్లో ఏ స్థాయిలో ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ప్రస్తుతం నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా అన్నగారితో కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అటు రాజకీయాల్లో కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేసిన అలనాటి సీనియర్ నటి జయప్రద తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆమె ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు.


ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను ఇండస్ట్రీలోకి రాజకీయాల్లోకి వచ్చానని ఆమె చెప్పారు. "నేను సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే నాకు ఓ రోజు ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంట్గా ఇంటికి రమ్మని పిలిచారు. అప్పుడు నేను షూటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పాను. అయితే ఎన్టీఆర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి రమ్మని అన్నారు. నేను వెళ్లి ఎన్టీఆర్ని కలిసి మాట్లాడాను. అప్పుడు ఆయన నన్ను టిడిపి పార్టీలో జాయిన్ అవమని కోరారు. అప్పుడు ఏం ఆలోచించకుండా కేవలం ఆయన కోసమే టీడీపీ జాయిన్ అయ్యాను. ఆ సమయంలో నన్ను చాలామంది నువ్వు రాజకీయాల్లోకి వెళ్లి రిస్క్ చేస్తున్నావ్ అని చెప్పారు. కానీ నేను మాత్రం కేవలం ఎన్టీఆర్ కోసమే రాజకీయాల్లోకి వెళ్లాను. ఆయన్ని ఎలాగైనా సీఎం గా చూడాలని అనుకున్నాను. ఆ కల తొందరగా నెరవేరింది అంటూ చెప్పారు. ఇండస్ట్రీలో ఒక అగ్ర నటుడై ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా కూడా ఎంతో చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు.


పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ఆయన ఎంతో తపనపడ్డారు. హీరోగా అంత స్టార్‌డమ్ ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడ్డారు. ఆ రోజుల్లో జనాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా గంజి అన్నం తినడమేంటి? రోడ్లపై పంపు కింద స్నానాలు చేయడమేంటి? ఇవన్నీ చూశాక మనం కూడా ఇలాంటివి ఎందుకు చేయలేము. ఆయనలా కాకుండా ఆయన నుంచి డిస్ప్లేన్, సింప్లిసిటీ ఆయన సిన్సియార్టీని ఫాలో కావచ్చు అంటూ చెప్పుకొచ్చారు జయప్రద. అంతేకాదు ఆయన నటనకే నటన నేర్పిన మహా మహానటుడు. ఇక రాజకీయాల్లో కూడా ఆయన స్ఫూర్తితోనే నేను సక్సెస్ అవడం జరిగింది. ఆయనతో కలిసి సినిమాలే కాదు రాజకీయ అడుగులు వేయడం ఎప్పుడు కూడా ఓ అదృష్టంగా భావిస్తాను" అంటూ ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.