తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న మహానటుడు నందమూరి తారక రామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. నటుడిగానే కాదు.. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా, రచయితగానూ ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఏడాది ఆయన శత జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో 'డైరెక్టర్ గా రామారావు' సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
‘సీతారామ కళ్యాణం’ (1961)
1949లో ‘మన దేశం’ సినిమాతో చలన చిత్ర రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్.. 1961లో ‘సీతారామ కళ్యాణం’ సినిమాతో దర్శకుడిగా అవతరించారు. మెగా ఫోన్ పట్టుకొని తన తొలి సినిమాతోనే అద్భుత విజయాన్ని సాధించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ చిత్రాన్ని ఎన్. త్రివిక్రమ రావు నిర్మించారు. ఇందులో రామారావుతో పాటుగా గీతాంజలి, సరోజినీ దేవి, కాంతారావు, శోభన్ బాబు, హరినాథ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
'గులేబకావళి కథ' (1962)
N.T రామారావు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. అరేబియన్ నైట్స్ నుంచి సేకరించిన 'గులేబకావళి' అనే జానపద కథ ఆధారంగా ఈ ఫాంటసీ చిత్రాన్ని రూపొందించారు. త్రివిక్రమ రావు దీనికి నిర్మాత. ఇందులో ఎన్టీఆర్ సరసన జమున, నాగరత్న కథానాయికలుగా నటించారు. డైరెక్టర్ గా, యాక్టర్ గా రెండు విభాగాలను సమర్థవంంగా నిర్వహించిన ఆయన.. మరో కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
'శ్రీ కృష్ణ పాండవీయం' (1966)
మహాభారతంలోని పాండవులు - శ్రీకృష్ణుడు పర్వం ఆధారంగా తెరకెక్కించిన పౌరాణిక చిత్రమిది. ఇందులో ఎన్టీ రామారావు కృష్ణుడు, దుర్యోధనుడు వంటి రెండు పాత్రలను పోషించారు. అంతేకాదు ఈ సినిమా కోసం తొలిసారిగా ఆయన స్క్రీన్ రైటర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. కెఆర్ విజయకు ఇది తెలుగు డెబ్యూ. ఉదయ్ కుమార్, ఎస్. వరలక్ష్మి కీలక పాత్రల్లో నటించారు. త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
'వరకట్నం' (1968)
ఎన్టీఆర్ స్వయంగా కథ - స్క్రీన్ ప్లే సమకూర్చి, దర్శకత్వం వహించిన సోషల్ డ్రామా ఇది. ఇందులో సావిత్రి, కృష్ణ కుమారి హీరోయిన్లుగా నటించారు. N. త్రివిక్రమరావు నిర్మించారు. ఇది తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ సాధించడమే కాదు.. బాక్సాఫీసు వద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది.
'తల్లా? పెళ్ళామా?' (1970)
NT రామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఐదో సినిమా ఇది. ఇందులో చంద్రకళ కథానాయికగా నటించింది. నందమూరి హరికృష్ణ చైల్డ్ ఆర్టిస్టుగా ఈ చిత్రంతో తెరంగేట్రం చేశారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై N. త్రివిక్రమరావు నిర్మించారు. ఈ చిత్రాన్ని హిందీలో 'బిదాయి' (1974) పేరుతో, తమిళంలో 'పిరియా విదై' (1975)గా రీమేక్ చేయబడింది.
'కన్నన్ కరుణై' (1971)
నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఏకైక తమిళ్ సినిమా 'కన్నన్ కరుణై'. ఈ పౌరాణిక చిత్రంలో ఆయనకు జోడీగా కేఆర్ విజయ నటించింది. గీతాంజలి, వరలక్ష్మి కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రం తెలుగులో 'రాజసూయం' పేరుతో రిలీజ్ అయింది.
'తాతమ్మ కల' (1974)
ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇందులో భానుమతి రామకృష్ణ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ నటుడిగా తెరంగేట్రం చేయగా, సోదరుడు హరికృష్ణ కూడా ఒక పాత్రలో కనిపించారు.
'దాన వీర శూర కర్ణ' (1977)
మహాభారతంలోని కర్ణుడి జీవితం ఆధారంగా రామారావు తెరకెక్కించిన పౌరాణిక చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి సంచలనం సృష్టించారు. శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు పాత్రల్లో అధ్బుతమైన నటన కనబరిచారు. ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ అర్జునుడు, నందమూరి బాలకృష్ణ అభిమన్యుడు పాత్రలను పోషించారు. కేవలం 43 రోజుల్లో తీసిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులకు బాట వేసింది.
'చాణక్య చంద్రగుప్త' (1977)
క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందిన మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్య, అతని గురువు చాణక్యుడి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. రామారావు కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ వంటి మరో ఇద్దరు లెజెండరీ నటులు భాగమయ్యారు. జయప్రద, మంజుల కథానాయికలుగా నటించారు.
'అక్బర్ సలీం అనార్కలి' (1978)
మొఘల్ యువరాజు సలీం (జహంగీర్) మరియు ఆస్థాన నర్తకి అనార్కలి మధ్య ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అక్బర్ గా ఎన్టీ రామారావు నటించగా.. జోధాగా జమున, సలీంగా బాలకృష్ణ, అనార్కలిగా దీప కనిపించారు. ఎన్టీఆర్ నిర్మాతగా రచయితగా దర్శకుడిగా వ్యవహరించిన ఈ చారిత్రాత్మక రొమాంటిక్ డ్రామా బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు.
'శ్రీరామ పట్టాభిషేకం' (1978)
రామాయణం ఆధారంగా NT రామారావు హోమ్ బ్యానర్ లో దర్శకత్వం వహించిన హిందూ పౌరాణిక చిత్రమిది. ఇందులో రాముడు మరియు రావణుడుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. సంగీత, జమున, రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
'శ్రీమద్ విరాట పర్వం' (1979)
మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ ఇది. ఇందులో ఆయన ఐదు పాత్రలు పోషించారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, బృహన్నల మరియు కీచకుడుగా కనిపించారు. వాణిశ్రీ, బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రామరావు అర్జునుడిగా నటించిన 'నర్తనశాల' సినిమాకు ఇది కలర్ రీమేక్ గా పేర్కొనబడింది.
'శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం' (1979)
తిరుమలలో లార్డ్ వెంకటేశ్వర అవతార్ ఆధారంగా రామారావు ఈ పౌరాణిక చిత్రాన్ని రూపొందించారు. ఇందులో వేంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించగా.. లక్ష్మీ దేవిగా జయసుధ, పద్మావతిగా జయప్రద, నారదుడిగా బాలకృష్ణ కనిపించారు.
'చండ శాసనుడు' (1983)
రామారావు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తూ, దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ 'చండ శాసనుడు'. దీనికి పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు నటించిన చివరి సినిమా ఇది. ఇందులో శారద, రాధ మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీసు వద్ద హిట్టయిన ఈ చిత్రాన్ని తమిళంలో 'సరితిర నాయగన్' పేరుతో రీమేక్ చేశారు.
'శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' (1984)
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఆధారంగా NT రామారావు తన హోమ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో గౌతమ బుద్ధుడు, యోగి వేమన, రామానుజులు, ఆదిశంకర, వీర బ్రహ్మం పాత్రలను రామారావు పోషించారు. నందమూరి బాలకృష్ణ, రతీ అగ్నిహోత్రి, కాంచన కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ 1981లోనే పూర్తయినప్పటికీ, సెన్సార్ బోర్డు నుండి కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదల ఆలస్యమైంది. దీనిపై కోర్టుకు వెళ్ళిన ఎన్టీఆర్.. 1984 నవంబర్ లో సినిమాని విడుదల చేశారు.
'బ్రహ్మర్షి విశ్వామిత్ర' (1991)
విశ్వామిత్ర మహర్షి జీవితం ఆధారంగా తారక రామారావు కథ స్క్రీన్ ప్లే సమకూర్చి, దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం ఇది. తొలిసారిగా ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఏడేళ్ల విరామం తర్వాత ఆయనకు కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇందులో నందమూరి బాలకృష్ణ మీనాక్షి శేషాద్రి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేశారు.
'సామ్రాట్ అశోక' (1992)
నందమూరి తారకరామారావు దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా ఇది. మౌర్య చక్రవర్తి అశోకుడి జీవితం ఆధారంగా రూపొందించారు. దీనికి ఎన్టీఆర్ కథ - స్క్రీన్ ప్లే అందించడమే కాదు, ఎడిటింగ్ కూడా చేశారు. ఇందులో రామారావు అశోకుడగా, చాణక్యగా ద్విపాత్రాభినయం చేశారు. వాణీ విశ్వనాథ్, మంచు మోహన్ బాబు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇలా నందమూరి తారక రామారావు తన కెరీర్ లో 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిల్లో 5 చిత్రాలు బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 3 సినిమాలు సూపర్ హిట్లు అవ్వగా, 5 చిత్రాలు పర్వాలేదనిపించాయి. మిగతా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను అలరించలేక పోయాయి. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ హోమ్ బ్యానర్ లోనే రూపొందడం గమనార్హం.
Read Also: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు దిగ్గజాలు - 'లాల్ సలామ్'లో రజినీతో ఇండియన్ క్రికెట్ లెజెండ్