నందమూరి తారక రామారావు. తెలుగు నాట ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడు.  విశ్వ విఖ్యాత నటసార్వభౌమగా పేరు సంపాదించుకున్న ఆయన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక  చిత్రాల్లో ఎన్నో అద్భుత పాత్రలు పోషించి అందరిచేత ప్రశంసలు పొందారు.  రాముడు, కృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడు లాంటి పాత్రలే కాదు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడి లాంటి పాత్రల్లో ప్రాణం పెట్టి నటించారు. అలాంటి మహనీయుడు సినిమా రంగంలోకి ఎలా అడుగు పెట్టారు? తొలి సినిమాలు ఎలా అవకాశం వచ్చింది? అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేయడం మొదలు పెట్టిన ఎన్టీఆర్


ఎన్టీఆర్ కాలేజీ రోజుల నుంచే నాటకాలు వేయడం మొదలు పెట్టారు. కాలేజీ వార్షికోత్సవంలో భాగంగా విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘రాచమల్లు దౌత్యం’ అనే నాటకంలో నాయకురాలు నాగమ్మ పాత్ర పోషించారు ఎన్టీఆర్. అదే ఆయన తొలి నాటక ప్రదర్శన. ఆ తర్వాత ‘అనార్కలి’ నాటకంలో సలీం పాత్ర పోషించి మెప్పించారు. అద్భుత నటనకు గాను బహుమతి అందుకున్నారు. 1942లో మేనమామ కుమార్తె బసవతారంతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత గుంటూరు ఏ.సీ కాలేజీలో బీఏలో జాయిన్ అయ్యారు. అక్కడే  జగ్గయ్య, కేవీఎస్ శర్మ, వల్లభజోసుల శివరాంతో పరిచయం ఏర్పడింది. కాలేజీ విద్యార్థులంతా కలిసి పలు రకాల నాటకాలు వేసేవారు. ఓసారి ఆంధ్రనాటక కళాపరిషత్ ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనను చూసేందుకు శ్రీరంజని భర్త నాగుమణి వచ్చారు. రామారావు నటన అతడికి బాగా నచ్చింది.


ఉద్యోగంలో చేరిన కొత్తలోనే సినిమా అవకాశాలు


అదే సమయంలో సి పుల్లయ్య ‘కీలుగుర్రం’ అనే సినిమా చేయాలి అనుకున్నారు. కొత్త నటీనటుల కోసం వెతుకుతున్న ఆయన దగ్గరికి రామారావును తీసుకెళ్లారు నాగుమణి. ఆయన ఫోటో తీసుకుని మద్రాసుకు వెళ్లాక చెప్తాను అన్నారు. కానీ, ఆయన నుంచి సమాధానం రాలేదు. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఆ తర్వాత సినిమాలు వద్దనుకుని చదువు, ఉద్యోగం మీద ఫోకస్ పెట్టారు. మద్రాసు సర్వీస్ కమీషన్ సబ్ రిజిస్ట్రార్ సెలక్షన్స్ లో ఎంపిక అయ్యారు. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ గా చేశారు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు.  సినిమా అవకాశాలు ఇస్తామంటూ ఉత్తరాలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు.


ఒక రోజు అనుకోకుండా ఎల్వీ ప్రసాద్ నుంచి లెటర్ వచ్చింది. తాను నటి కృష్ణవేణి నిర్మిస్తున్న ‘మనదేశం’ సినిమాకు పనిచేస్తున్నానని, ఈ చిత్రంలో హీరో పాత్ర కాకుండా మరో మంచి పాత్ర ఉందని చెప్పారు. ఆ ఉత్తరాన్ని రామారావు లైట్ తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఎల్వీ ప్రసాద్ నుంచి మరో లేఖ వచ్చింది. అందులో రెండు ఉత్తరాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎల్వీ ప్రసాద్ రాసినది కాగా, మరొకటి బిఎ సుబ్బారావు రాసినది. ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో ముఖ్యపాత్రకు రామారావును ఓకే చేశామని, మద్రాసుకు రావాలని సుబ్బారావు ఆ లేఖలో రాశారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎన్టీఆర్ మద్రాసుకు వెళ్లారు.


తొలి సినిమా రెమ్యునరేషన్ రూ. 2 వేలు


రామారావును నటి, నిర్మాత కృష్ణవేణికి పరిచయం చేశారు ఎల్వీ ప్రసాద్. ఆమె ఎన్టీఆర్ ను తన సినిమాలోకి తీసుకుంటానని చెప్పారు.  ఈ సినిమా కోసం రూ.2 వేలు పారితోషికం ఇస్తానని చెప్పారు. అడ్వాన్సుగా  రూ. 200 చెక్కు ఇచ్చారు. అలా ఎన్టీఆర్ తొలి సినిమా ‘మనదేశం’లో అవకాశం వచ్చింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1949లో విడుదల అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారు. భారత స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ‘విప్రదాస్’ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా  ‘పల్లెటూరి పిల్ల’, ‘షావుకారు’ అనే సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో అవకాశాలు రావడానికి కారణం ఎల్వీ ప్రసాద్. ఆ తర్వాత ఎన్టీఆర్ నటారంగంలో వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు.