Alluri Sitarama Raju District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు.. పైఅధికారల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. రోజూలాగే ఉదయాన్నే కార్యాలయానికి వచ్చిన ఎమ్మార్వో శ్రీనివాస్.. ఆకలేస్తుంది, టిఫిన్ తీసుకు రమ్మని అటెండర్ కు సూచించారు. అటెండర్ తిరిగి వచ్చేసిరి తహసీల్దార్ శ్రీనివాస్ కార్యాలయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే టిఫిన్ తీసుకు వచ్చిన అటెండర్ ఎమ్మార్వో ఉరివేసుకొని చనిపోవడాన్ని గుర్తించి షాక్ అయ్యాడు. వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం తహసీల్దార్ శ్రీనివాస్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచి పదవిలో ఉన్న తమ కుమారుడు.. అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడాన్ని శ్రీనివాస్ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు.
అధికారుల వేధింపులు తాళలేకే ఆత్మహత్య
ఎమ్మార్వో శ్రీనివాస్ బలవన్మరణానికి అధికారుల వేధింపులే కారణమని సిబ్బంది చెబుతున్నారు. ఈనెల 5వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి శ్రీనివాస్ వెళ్లారు. ఈ కార్యక్రమంలోనే భూముల రీసర్వే విషయంలో ఐటీడీఏ పీఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే బాధపడుతూ వచ్చిన శ్రీనివాస్ ప్రతిరోజూ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వీఆర్వో ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమగ్ర భూసర్వే పేరుతో తనను అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేశారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు
సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య
డిల్లాలోని జి.సిగడాం మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన తనికెళ్ళ సంతోష్ అదే గ్రామ వీఆర్వోగా పని చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా సమగ్ర భూ సర్వే పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ సర్వేలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కానీ గ్రామంలోని పలువురి భూములు సరైన సర్వే నెంబర్లు లేకపోవడం, గొడవలు జరుగుతుండడంతో పనులు ఆగిపోయాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలని పైఅధికారులను ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కానీ వెంటనే పనులు పూర్తి చేయాలని మాత్రం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది తట్టుకోలేని సంతోష్ ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేశాడు. కానీ కాసేపటికే కుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీఆర్వో సంతోష్ చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.