Crime News In Telangana: తెలంగాణలో ఒకే రోజు దారుణాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad) ఛాయ్ పెట్టలేదని ఓ అత్త తన కోడలిని దారుణంగా హతమార్చింది. అటు, మెదక్ జిల్లాలో పాతకక్షలు, భూతగాదాలతో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. అలాగే, సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ తన భర్తను గొడ్డలితో నరికి చంపింది. మరోవైపు, జగిత్యాల జిల్లాలో ఓ మహిళ తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్ హసన్ నగర్‌లో గురువారం ఉదయం ఫర్జానా అనే మహిళ తన కోడలు అజ్మీరాబేగం(28) ను టీ పెట్టి ఇవ్వాలని అడిగింది. అయితే, అందుకు కోడలు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫర్జానా.. బేగం మెడకు చున్నీతో ఉరి వేసి హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తను చంపేసిన భార్య
అటు, సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోనూ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్నబిడ్డపైనే పాశవికంగా ప్రవర్తించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో తన పిల్లలను రక్షించుకునేందుకు భర్తను నరికి చంపిన భార్య.. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మాణయ్య, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరి పెద్ద కూతురు భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో మాణయ్య కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అతని భార్య ఇందిర భర్తను గొడ్డలితో నరికి చంపింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లీకుమార్తె పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఇంట్లో గొడవల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం వారి కొడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైతును దారుణంగా చంపేశారు
మెదక్ (Medak) జిల్లా రామాయంపేట (Ramayampeta) మండలం లక్ష్మాపూర్ గ్రామంలోనూ గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రైతు రాగుల అశోక్‌ను.. కొందరు బండరాయితో కొట్టి హతమార్చారు. ఉదయం పొలం వద్దకు వెళ్లగా.. అప్పటికే పక్క పొలంలో కాపు కాసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు పాతకక్షలు, భూ తగాదాలే కారణమని భావిస్తున్నారు. గ్రామానికి చెందిన చేవూరి రమేశ్ కుటుంబమే ఈ హత్యకు పాల్పడిందని.. గ్రామస్థులు, బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో గ్రామస్థులు వారి ఇంటిపై దాడికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జగిత్యాలలో విషాదం
మరోవైపు, జగిత్యాల జిల్లాలోనూ విషాదం జరిగింది. సారంగాపూర్ (Sarangapur) మండలం అర్పల్లి గ్రామంలో బొండ్ల మౌనిక అనే వివాహిత తన కూతురితో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అయితే, బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ కలహాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మౌనిక భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.