Kamal Haasan says It's citizens right to ask questions: విలక్షణ నటుడు కమల్ హాసన్.. ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో అభిమానులను అలరిస్తుంటారు. కమల్ ఎంచుకునే స్టోరీలు చాలా భిన్నంగా ఉంటాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కవగానే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటే 'భారతీయుడు'. 1996లో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది. ప్రభుత్వ ఆఫీసుల్లోని అవినీతి, స్వాతంత్య్ర సమరం కాలంలో ఉన్న ఇబ్బందులు ఆ సినిమాలో చూపించారు. ఇక ఇప్పుడు ఆయన నటించిన 'భారతీయుడు - 2' సినిమా దానికి కొనసాగింపుగా రిలీజ్ కాబోతుంది. దాంట్లో కమల్ హాసన్ సేనాపతి అనే స్వాతంత్య్ర సమరయోథుడి పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తే ఇది కూడా అవినీతిపై పోరాటం లాగానే కనిపిస్తుంది. అయితే, ఇలాంటి సినిమాలు చేయడంపై కమల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
భయం అనిపించదా?
'భారతీయుడు', 'భారతీయుడు -2', ఇంకా చాలా సినిమాలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఉన్నాయి కదా? అవి చేస్తే మీకు రిస్క్ అవ్వదా? అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కమల్‌కు ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఒక ఆర్టిస్ట్ కూడా ఈ దేశ పౌరుడే కాబట్టి కచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంటుంది అని చెప్పారు కమల్ హాసన్. ఇలాంటి ఇబ్బందులు బ్రిటిష్ కాలం నుంచే ఉన్నాయని, ఇప్పుడు అవేమీ పెద్ద రిస్క్ అనిపించవు అని సమాధానం ఇచ్చారు.
"మేం ఆర్టిస్టులుగా లక్షలాది మంది తరఫున నిలుచుంటాం. ఇలాంటి సినిమాలు చేస్తే రిస్క్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం మా మీద కోపం ప్రదర్శించొచ్చు కూడా. కానీ, ప్రేక్షకులు ఇచ్చే ప్రోత్సాహం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే, మేం ఇంకా బాగా చేయగలుగుతున్నాం. అవినీతికి మనమే కారణం. కాబట్టి మనమే దాన్ని నిర్మూలించాలి. మన మైండ్ సెట్ మారాలి. మనం మారడానికి మంచి సమయం ఎన్నికలు. అవినీతి విషయంలో ఏదీ మారలేదు. కాబట్టి అందరం కలిసి అవినీతిని తీసేయాలి. నేను గాంధీకి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సహనాన్ని నేర్పించారు అని అంటారు. అసలు సహనం అంటే ఏంటి? సహనం అంటే ఏంటో తెలుసకోవాలి. అది ఒక వ్యాపారం కాదు. గాంధీజీ నాకు హీరో. ప్రపంచం మొత్తం స్నేహంతో ఉండాలి. కానీ, ఇప్పుడు మనం భరిస్తున్నది మాత్రం నిజంగా తలనొప్పి. అందుకే, జీరో టాలరెన్స్ ఉండాలి. అలా ఉండాలంటే దానికి మందు కనిపెట్టాలి" అంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.
ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'భారతీయుడు - 2'. ఈ సినిమాలో కాజల్, సిదార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జులై 12న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. కాగా.. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సేనాపతి అనే క్యారెక్టర్ లో నటిస్తున్నారు కమల్ హాసన్. ఆయన కనిపించే సీన్లు, క్యారెక్టర్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.
Also Read: తొలి రోజే 'కల్కి' హవా - అక్కడ ఆర్‌ఆర్‌ఆర్, సలార్ చిత్రాల రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్