దొంగలు శ్రుతి మించిపోతున్నారు. ఎక్కడ ఏది పడితే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు చదివే ఈ దొంగ చాలా ఖతర్నాక్. ఇంతవరకు ఇలాంటి చోరీ మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూసి ఉండరు. విని ఉంటారో లేదో కూడా తెలియదు.


అలాంటి చిత్రమైన దొంగతనానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా మారింది హైదరాబాద్. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చాడు యాదగిరి. కరీంనగర్‌ నుంచి వచ్చిన ఆయనకు పోలీసులు చికిత్స అందించారు. ఆరోగ్యవంతుడిగా తిరిగి వెళ్తూ ఆయన చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. 


చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వచ్చి యాదగిరి... వైద్యం పూర్తైన తర్వాత ఆసుపత్రిలోని అంబులెన్స్‌ దొంగిలించాడు. డైలీ లేబర్‌గా పని చేస్తున్న ఆయన.... గతంలో కూడా చాలా దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు చేసిన దొంగతనం మాత్రం పోలీసులకు ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోనుంది. 


గాంధీ ఆసుపత్రిలో అంబులెన్స్ కనిపించకపోయేసరికి సిబ్బంది ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఏమైందేమో అని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. వాళ్లు వచ్చి సిసిటీవీ  ఫుటేజ్  చూస్తే యాదగిరి అంబులెన్స్‌ తీసుకెళ్లిపోతున్న దృశ్యాలు షాక్‌కి గురి చేశాయి. అంబులెన్స్‌ వెళ్తున్నదారి, జీపీఎస్‌ ట్రాకింగ్ సిస్టమ్‌తో అతను మెహిదీపట్నం వైపు వెళ్తున్నట్టు గుర్తించారు. అక్కడ పోలీసులను అలెర్ట్ చేసి నిందితుడిని మెహదీపట్నంలో అరెస్టు చేశారు. 


మద్యం మత్తులో ఉన్న యాదగిరి గాంధీ ఆసుపత్రి నుంచి మెహదీపట్నం వరకు అంబులెన్స్ నడుపుకొంటూ వెళ్లిపోయాడు. యాదగిరిపై ఇప్పకిపై సెల్‌ఫోన్ చోరీ కేసులు ఉన్నాయి. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉన్నాయి. అతని నుంచి అంబులెన్స్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.