Child Fall From 13th Floor Balcony In Maharastra: ఆ చిన్నారి నిజంగా మృత్యుంజయురాలే. 13వ అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయినా కూడా ఓ వ్యక్తి సమయ స్ఫూర్తితో ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని (Maharastra) డోంబివలీలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి నెట్టింట వైరల్‌గా మారింది. సకాలంలో చాకచక్యంగా స్పందించి చిన్నారిని కాపాడిన వ్యక్తిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని డోంబీవలీలో (Dombivali) స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్ 13వ అంతస్తులోని బాల్కనీ వద్ద ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కింద పడుతుండడాన్ని స్థానికంగా ఉన్న భవేశ్ మాత్రే గమనించారు.
చాకచక్యంగా వ్యవహరించి..
క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే చిన్నారిని కాపాడేందుకు పరిగెత్తారు. పాపను పూర్తిగా పట్టుకోలేకపోయినప్పటికీ.. చిన్నారిని కాస్త పట్టుకోవడంతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారు. దీంతో స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో చిన్నారి బాల్కనీలో ఆడుకుంటోందని.. ప్రమాదవశాత్తు కింద పడే ముందు బాల్కనీ అంచును పట్టుకుని వేలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలని క్షణం సైతం ఆలస్యం చేయకుండా ముందుకెళ్లాలని మాత్రే తెలిపారు. ధైర్యం, మానవత్వానికి మించిన గొప్ప మతం మరొకటి లేదని అన్నారు. అటు, ఆయన సమయస్ఫూర్తిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొనియాడుతున్నారు.