Budget-2025:  భారత్‌ వ్యవసాయ దేశం.. దేశ జనాభాలో ఎక్కువ భాగం  వ్యవసాయం, దాని అనుబంధం రంగాలపైనే  ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి కీలకమైన రంగానికి  రానున్న బడ్జెట్‌లో  అధిక ప్రాధాన్యం ఇవ్వాలని  వ్యవసాయరంగ నిపుుణులు కోరుతున్నారు. ఇప్పటికే బడ్జెట్‌ (Budget) కేటాయింపులపై తుది కసరత్తు చేస్తున్న ఆర్థికశాఖ..గతం కన్నా మిన్నగా  కేటాయింపులు చేయాలని సూచిస్తున్నారు.  వ్యవసాయ ఉత్పాదకత  పెంచడంతోపాటు ఈరంగంలో స్థిరమైన వృద్ధి ఉండేలా అవసరమైన మేర మౌలిక సదుపాయాలు కల్పనపై  దృష్టి పెట్టాలని వ్యవసాయరంగ నిపుణులు భావిస్తున్నారు. గ్రామీణుల ఆదాయం పెంచేలే  బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలని కోరుతున్నారు.
 
మౌలిక సదుపాయలకు పెద్దపీట
సంప్రదాయ సాగుకు కాలం చెల్లిన నేటి రోజుల్లో పంట పెట్టుబడులు తగ్గించడంతోపాటు పండించిన పంట దెబ్బతినకుండా చూసుకునేలా కోల్డ్‌స్టోరేజీ( Cold Storage), వేర్‌హౌసింగ్‌(Ware Housing)కు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సప్లై చైన్ మేనేజ్‌మెంట్  పెంపొందించడానికి గతంలో కేటాయించిన కేటాయింపులకు రెట్టింపు ఇవ్వాలని కోరుతున్నారు.  రైతులకు మెరుగైన మార్కెటింగ్ పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ రుణాల వడ్డీరేట్లను 3 నుంచి 5శాతానికి తగ్గించడమేగాక...రుణసదుపాయలను మెరుగుపరచాలన్నారు. చిన్న,సన్నకారు రైతులకు సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, సోలార్‌ పంపుసెట్లు(Solar Pumps), వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌లకు బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించాలన్నారు. 
 
అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు
యాంత్రీకరణ సాగు, డ్రోన్‌లతో మందుల పిచికారీ, రిమోట్‌తో మోటార్‌ ఆన్‌,ఆఫ్‌ వంటి అత్యాధునిక హంగులు నెలకొన్న కాలంలో సాగును మరింత సులభతరం చేసేలా అగ్రిటెక్‌ స్టార్టప్‌లు మరియు సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు ఆర్థికసాయం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అగ్రిటెక్‌ స్టార్టప్‌లకు పదేళ్లపాటు పన్ను మినహాయించడం ద్వారా వారు మరిన్ని ఆవిష్కరణలు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించినట్లు ఉంటుంది. అలాగే మూలదన వ్యయంపై 50శాతం రాయితీ ఇవ్వడంతోపాటు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల  స్టార్టప్‌లు, తయారీదారులపై ఆర్థిక ఒత్తిళ్లు తగ్గనున్నాయి.
 
వ్యవసాయ ఉపకరణాలు ,యంత్రాలకు ప్రత్యేక రాయితీలు
 
వ్యవసాయ,అనుబంధ రంగాలకు యంత్రాలకు రూపకల్పన చేసే సూక్ష్మ, మధ్యతరగతి తయారీదారులకు ప్రత్యేకంగా ఉత్పత్తి లింక్డ్‌ ఇన్సెంటివ్‌ పథకాలను ప్రవేశపెట్టడం వల్ల ఉత్పత్తి సామర్థ్యాలు గణనీయంగా  పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బయోఫెర్టిలైజర్స్‌ మరియు బయోపెస్టిసైడ్స్‌పై జీఎస్టీ మిహాయించొచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రైతులకు అందుబాటు ధరల్లోనే మందులు లభిస్తాయని...తద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రైతులు పర్యావరహణ హిత వ్యవసాయం చేసేందుకు మొగ్గుచూపుతారన్నారు.