Saif Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై దాడి కేసులో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటోంది. తాజాగా అరెస్టయిన నిందితుడిని అక్రమ బంగ్లాదేశీ వలసదారుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడు దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలిపారు. నిందితుడిని ఈ రోజు తెల్లవారుజామున థానేలోని హీరానందనీ ఎస్టేట్‌లో అరెస్టు చేశారు. అతన్ని ప్రస్తుతం ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ రోజు అతన్ని హాలిడే కోర్టులో హాజరుపరచనున్నారు, అక్కడ పోలీసులు నిందితుడిని కస్టడీకి కోరనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోన్-IX డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీక్షిత్ గెడమ్ మాట్లాడుతూ.. నిందితుడిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించి, అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రస్తుతం అతని వయసు 30ఏళ్లు అని.. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తిగా అనుమానిస్తున్నామని చెప్పారు. మునుపెన్నడూ అతనిపై కేసులు నమోదైనట్టు రికార్డుల్లో లేదన్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవని, కానీ అతని దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్న అంశాలను బట్టి అతను బంగ్లాదేశీ అని సూచించేలా కొన్ని ఆధారాలున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడిపై పాస్‌పోర్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
సైఫ్ ఇల్లు అని తెలియకుండానే దొంగతనానికి యత్నం
మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ సుమారు 4 నెలల క్రితమే ముంబైకి వచ్చాడని, నగరం పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నాడని పోలీసులు తేల్చారు. అతను ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేస్తున్నాడన్నారు. అయితే తాను వెళ్లిన ఇల్లు సైఫ్ అలీఖాన్‌కు చెందినదని తనకు తెలియదని అరెస్టు తర్వాత పోలీసులు జరిపిన విచారణలో నిందితుడు వెల్లడించాడు. బంగ్లాదేశ్ వలసదారుల కోణంతో, ఈ కేసును ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) పర్యవేక్షిస్తోంది. ఫెడరల్ ఏజెన్సీల అధికారులు ఈ నిందితుడిని విచారించవచ్చని సమాచారం.
Also Read : Saif Ali Khan Attack Case: సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడి అరెస్ట్, ఇంతకీ ఎవరతడు?